టీటీడీ ఉద్యోగుల్లో 743 మందికి కరోనా పాజిటివ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2020 11:55 AM GMT
టీటీడీ ఉద్యోగుల్లో 743 మందికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఇప్పటి వరకు 743 మంది కరోనా బారిన ప‌డ్డార‌ని ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వీరిలో దాదాపు 400 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారన్నారు. ఇంకా 338 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. అలాగే కోవిడ్‌తో ఐదుగురు టీటీడీ ఎంప్లాయిస్ మృతి చెందారని తెలిపారు.

జులై నెలలో శ్రీవారికి హుండీ ద్వారా రూ. 16 కోట్లు రాగా.. ఈ-హుండీ ద్వారా మ‌రో రూ. 3 కోట్లు వ‌చ్చినట్టు వివ‌రించారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వార్షిక బడ్జెట్ రూ. 3,200 కోట్లు కాగా, ఇందులో రూ. 1,350 కోట్లు కేవలం జీత‌భ‌త్యాల‌కే ఖర్చు అవుతుందన్నారు. చాలా మితంగా ఖ‌ర్చులు చేస్తున్న‌ప్ప‌టికీ ప్రస్తుతం రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు నెల‌కు ఖర్చులు అవుతున్నాయ‌ని చెప్పారు. ఇప్పటి వరకు కార్పస్ ఫండ్ నుంచి డ‌బ్బు తీసుకోలేద‌ని వెల్లడించారు. టీటీడీ బోర్డుతో చ‌ర్చించిన అనంత‌రం దీనిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. తిరుమల శ్రీవారి కల్యాణోత్సవాలను ఆపాలని అర్చకులు తమతో చర్చించలేదని చెప్పారు. అర్చకులు ఏ సలహా ఇచ్చినా తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. కరోనా నయమైన అర్చకుల్లో చాలా మంది ఆలయ విధులకు హాజరవుతున్నారని, అయితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అర్చకులకు తిరుమలలో విధులు ఇవ్వవద్దని ప్రధాన అర్చకులకు చెప్పామని ఈవో వెల్లడించారు. దర్శనాల కోసం అర్చకులను ఇబ్బందులకు గురిచేయాలన్న ఆలోచన టీటీడీకి లేదని స్పష్టం చేశారు.

ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే వున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 వరకు 62,123 మందికి పరీక్షలు నిర్వహించగా, 10,080 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,17,040కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ శనివారం బులెటిన్‌లో పేర్కొంది.

Next Story
Share it