కరోనాను జయించిన ఆరు నెలల చిన్నారి
By సుభాష్ Published on 12 April 2020 7:15 PM ISTదేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 18 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, లక్షా 9 వేలకుపైగా మృత్యువాత పడ్డారు. అయితే మహారాష్ట్రలో ఆరు నెలల చిన్నారి కరోనాతో జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ముంబైలోని కళ్యాన్ ప్రాంతానికి చెందిన ఆరు నెలల చిన్నారికి కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేర్చిచారు. తర్వాత వైద్యులు పరీక్షించి కరోనా ఉన్నట్లు నిర్దారించారు. చికిత్సను అందించిన వైద్యులు ఈ రోజు చిన్నారిని డిశ్చర్జ్ చేశారు. కరోనా నుంచి కోలుకున్న అతిచిన్న వయస్కురాలిగా రికార్డుకెక్కింది.
దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చిన్నారిని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొస్తున్నారు. అంతేకాదు వారు వెళ్తుంటే స్థానికులు రోడ్డుకిరువైపులా ఉండి చప్పట్లతో స్వాగతించారు.
కాగా, ఇప్పటికే మహారాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఒక్క ఆదివారం నాడే 134 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1700లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది.