దేశంలోనే రెండో స్థానం: తెలంగాణలో 55 రకాల కరోనా వైరస్‌లు: జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా
By సుభాష్ Published on 4 Jun 2020 9:52 AM ISTతెలంగాణలోకరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, ఇప్పుడు ఇతర జిల్లాలకు కూడా మళ్లీ పాకుతోంది. అయితే తాజాగా జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంచలన విషయం బయటపెట్టింది. తెలంగాణలో 55 రకాల కరోనా వైరస్‌లు ఉన్నాయట. అంటే కరోనా వైరస్ 55 రకాలుగా జన్యు మార్పులు చేసుకుంటూ తీవ్రంగా విజృంభిస్తుందన్నమాట. ఈ విషయాన్ని జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. దేశంలో 198 రకాల కరోనా వైరస్‌లను గుర్తించినట్లు ప్రకటించింది. కరోనాకు చెందిన 400 జన్యువుల విశ్లేషణ అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు స్పష్టం చేసింది. ఈ లెక్కన చూసుకుంటే భారత్‌లోకి ప్రవేశించాక లేదా అంతకు ముందే ఈ జన్యుమార్పులు జరిగినట్లు తెలిపింది.
తెలంగాణ రెండో స్థానం
కాగా, దేశంలో అత్యధికంగా జన్యుమార్పులకు గురైన రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో 55 రకాల వైరస్‌లు ఉన్నట్లు గుర్తించినట్లు జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే.. గుజరాత్‌లోని ఒక్క అహ్మదాబాద్‌లో 60 రకాల కరోనా వైరస్‌లు ఉన్నట్లు గుర్తించింది. ఇక ఢిల్లీలో 39 రకాలు, మహారాష్ట్రలో 15 రకాల వైరస్‌లు ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఆ రెండు రకాల వైరస్‌లతోనే పాజిటివ్ కేసులు:
కాగా, దేశంలో గుర్తించి మొత్తం 198 కరోనా వైరస్‌లలో చైనా, యూరల నుంచి వ్యాపించిన రెండు రకాల కరోనా వైరస్‌ల వల్లే అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇరాన్, దుబాయ్ దేశాల్లో వ్యాపిస్తున్న రకం కరోనా ప్రభావం ఎక్కవగా భారత్‌లోనే ఉందన్నారు.