సీఎం కేసీఆర్ మిషన్ సాధ్యమేనా? 10 రోజుల్లో 50వేల పరీక్షలు చేయగలుగుతారా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Jun 2020 1:07 PM ISTతాను అనుకున్నది మాత్రమే చేసే అలవాటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎట్టకేలకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని.. కొత్త ప్రపోజల్ ను తెర మీదకు తీసుకొచ్చారు. ఎవరెన్ని చెప్పినా వినని ఆయన.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి.. భారీ ఎత్తున నిర్ధారణ పరీక్షలు నిర్వహించటం. పక్కనున్న ఏపీలో నిత్యం వేలాది టెస్టుల్ని చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం వందల్లో మాత్రమే ఈ పరీక్షలు పరిమితమయ్యేవి. అదేమంటే.. ప్రజలు అనవసరంగా ఆందోళనలకు గురి అవుతారన్న మాట వచ్చేది.
ఇప్పుడు అదే మాటను ప్రస్తావిస్తూ.. ప్రజలు ఆందోళన చెందకూడదన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున టెస్టుల్ని నిర్వహించేందుకు సిద్ధమైనట్లు కేసీఆర్ వెల్లడించటం తెలిసిందే. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ కు.. దాని చుట్టు ఉండే జిల్లాలకు కలిపి కేవలం వారం.. పది రోజుల్లో యాభై వేల పరీక్షలు చేయాలని డిసైడ్ అయ్యారు. సారు అనుకున్న తర్వాత కొండ మీదున్న కోతినైనా కిందకు తెస్తారన్న పేరు ప్రఖ్యాతులు ఉన్నా.. సాంకేతికంగా ఎంత వరకు సిద్ధమన్నది సందేహం.
నిర్దారణ పరీక్షల్ని నిర్వహించేందుకు ఇప్పటివరకూ ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే చేస్తున్న పరిస్థితి నుంచి.. ఇకపై ప్రైవేటు భాగస్వామ్యంలోనూ పరీక్షల్ని నిర్దారించే ప్రక్రియను షురూ చేస్తారు. వాస్తవానికి సీసీఎంబీకి రోజుకు రెండు వేల వరకూ పరీక్షలు నిర్వహించే సత్తా ఉన్నా.. దాన్ని పూర్తిస్థాయిలో వాడింది లేదంటారు.
తాజా నిర్ణయంతో గాంధీతో పాటు.. సీసీఎం.. ఇతర కేంద్రాల్లోనూ పరీక్షల్ని నిర్వహించే వీలుందని చెప్పక తప్పదు. ప్రాక్టికల్ గా చూస్తే.. వారం రోజుల్లో యాభై వేల పరీక్షలు అంటే.. రోజుకు 7 వేలకు పైనే చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ రోజుకు వందల్లో మాత్రమే నిర్దారణ పరీక్షలు చేసే స్థాయి నుంచి రోజుకు ఏడెనిమిది వేలకు పైనే పరీక్షలు చేయించటం ఒత్తిడితో కూడుకున్న పనిగా చెప్పక తప్పదు.
సీఎం కేసీఆర్ మాటలు చెప్పినంత ఈజీగా ఇంత భారీగా పరీక్షలు చేయటం సాధ్యం కాదన్న మాట వినిపిస్తోంది. కాస్త కష్టమైనా.. అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసే అవకాశం ఎక్కువని చెప్పాలి. యాభైవేల నిర్దారణ పరీక్షలు సరే.. ఒకవేళ ఊహించని రీతిలో భారీ ఎత్తున పాజిటివ్ లు నమోదైతే మాత్రం.. కొత్త తరహా ఇబ్బంది తప్పదన్న మాట వినిపిస్తోంది.