కేరళలో ఒకే కుటుంబంలో ఐదుగురికి సోకిన కరోనా
By అంజి Published on 8 March 2020 11:54 AM ISTముఖ్యాంశాలు
- కేరళలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు
- ఐసోలేషన్ వార్డులో బాధితులకు చికిత్స
- ఇటీవలే ఇటలీ నుంచి వచ్చిన కుటుంబ సభ్యుల్లోని ముగ్గురు
కేరళలో మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకింది. అయితే ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులకు కరోనా సోకడంతో అక్కడి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా బాధితులకు ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల్లోని ముగ్గురు ఇటీవలే ఇటలీ నుంచి వచ్చారు. ఆ ముగ్గురితో పాటు ఇంట్లోని మరో ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. పతనమిట్టలోని ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలిందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె శైలజ తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే వారు తప్పన సరిగా ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని, కావాల్సిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. కాగా భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లలోనూ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలున్న ప్రయాణికులను ప్రత్యేక పరిశీలన కోసం ఆస్పత్రులకు తరలించామని కేంద్రవిమానయాన శాఖ చెప్పింది. కరోనా లక్షణాలు ఉన్నవారంతా.. బంగ్లాదేశ్, ఒమన్, సౌదీ అరేబియా, సింగపూర్, ఇటలీ, యూఏఈ, మలేషియా నుంచి భారత్ వచ్చారని తెలిసింది.
ప్రపంచన్నా కరోనా వైరస్ వణికిస్తోంది. హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో.. తెలంగాణలో ఆందోళన రేకెత్తిస్తోంది. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిన్న ఒక్క రోజే 4,656 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇందులో 19 మందికి కరోనా లక్షణాలు గుర్తించారు. ఐదుగురికి కరోనా నెగిటివ్ రాగా, మరో 14 మంది రిపోర్టులు రావాల్సి ఉంది.
ఇరాన్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల శాంపిల్స్‌తో బయలుదేరిన మహన్ విమానం ఢిల్లీకి చేరుకుంది. ఫలితాలు రావడానికి కనీసం 12 గంటల సమయం పడుతుంది. తిరుగు ప్రయాణంలో మహన్ విమానం ఇరాన్ పౌరులను తీసుకువెళ్తుంది.