Fact Check : కేరళ విమాన ప్రమాదం బాధితుల్లో 40 మందికి కోవిద్-19 పాజిటివ్ అంటూ వచ్చిందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 2:05 PM GMT
Fact Check : కేరళ విమాన ప్రమాదం బాధితుల్లో 40 మందికి కోవిద్-19 పాజిటివ్ అంటూ వచ్చిందా..?

కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దుబాయ్‌ నుంచి వస్తున్న దుబాయ్‌–కాళికట్‌ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం శుక్రవారం రాత్రి 7.40 గంటల సమయంలో కోజీకోడ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదానికి గురైంది. భారీగా వర్షం పడుతుండటంతో రన్‌వే నుంచి పక్కకు జారి పక్కనే ఉన్న దాదాపు 50 అడుగుల లోతైన లోయవంటి ప్రదేశంలో పడిపోయింది. దీంతో ఆ బీ737 విమానం రెండు ముక్కలైంది. ఇద్దరు పైలట్లు కూడా ఈ ఘటనలో మరణించారు.

ఎయిర్ ఇండియా విమానంకు ఆగష్టు 18న ఈ ప్రమాదం జరుగగా 18 మంది చనిపోయారు. 150 మందికి పైగా గాయపడ్డారు.

ఈ ప్రమాద బాధితుల్లో 40 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మలయాళం వార్తా సంస్థ మాతృభూమి ట్వీట్ చేసింది. ఈ వార్తా కథనాన్ని న్యూస్ ఛానల్ డిలీట్ చేసినప్పటికీ.. ఆ ట్వీట్ ను ఇప్పటివరకూ డిలీట్ చేయలేదు. “40 Flight Crash Victims Test Positive For COVID 19 tv.mathrubhumi.com/news/kerala/fc…#KaripurFlightCrash #COVID19.” అంటూ తమ ట్వీట్ లో పేర్కొంది.

న్యూస్ నేషన్ సంస్థకు చెందిన సీనియర్ స్పెషల్ కరెస్పాండెంట్ పూరావ్ పటేల్ కూడా విమాన ప్రమాద బాధితుల్లో 40 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు.

నిజ నిర్ధారణ:

కేరళ లోని కోజికోడ్ లో చోటుచేసుకున్న విమాన ప్రమాద బాధితుల్లో 40 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నది 'అబద్ధం'

ఆగష్టు 8, 2020న మలప్పురం జిల్లా కలెక్టర్ కె.గోపాల కృష్ణన్ తన ట్వీట్ ద్వారా అది ఫేక్ వార్త అని స్పష్టం చేశారు. విమాన ప్రమాద బాధితుల్లో 40 మందికి కరోనా పాజిటివ్ అని వచ్చిన వార్తలో ఎటువంటి నిజం లేదని అన్నారు.

ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ సంస్థ కూడా ఈ కథనంలో ఎటువంటి నిజం లేదని చెప్పింది. యాక్సిడెంట్ బాధితులు, ప్రమాదంలో చనిపోయిన వారందరికీ కూడా కరోనా టెస్టులు చేశామని.. వారిలో ఒక్కరికి మాత్రమే కరోనా సోకిందని కేరళ ఛీఫ్ మినిస్టర్స్ ఆఫీసు తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.

కోజికోడ్ లో సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలిందని కేరళ మంత్రి కేటీ జలీల్ తెలిపారు. సుధీర్ వర్యాత్ (45) అనే ప్రయాణికుడి శాంపిల్స్ ను టెస్టింగ్ కు పంపగా.. పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత సహాయక చర్యల్లో పాల్గొన్న వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లాలని ఆయన కోరారు. ప్రమాద సమయంలో విమానంలో క్రూ సిబ్బందితో పాటు 190 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 149 మంది క్షతగాత్రులను కోజికోడ్, మలప్పురం జిల్లాల్లోని ఆసుపత్రుల్లో చేర్చారు.

విమాన ప్రమాద బాధితుల్లో 40 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. వైరల్ పోస్టులు 'పచ్చి అబద్ధం'.

Next Story