శుభవార్త: 21 నుంచి 40 ప్రత్యేక రైళ్లు
By సుభాష్ Published on 16 Sep 2020 8:41 AM GMTభారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 21 నుంచి దేశ వ్యాప్తంగా 40 క్లోన్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ, అధిక వెయిటింగ్ లిస్టులు ఉన్న రూట్లలో ఈ క్లోన్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ క్లోన్ రైళ్లకు పది రోజులకు ముందే అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.
సాధారణ రైళ్లకంటే ముందే..
ఈ రైళ్లు సాధారణ రైళ్లకంటే ముందుగా బయలుదేరుతాయి. వీటికి హల్టింగులు కూడా తక్కువగా ఉంటాయని రైల్వేబోర్డు చైర్మన్ వినోద్ కుమార్ తెలిపారు. ఇక ఈ క్లోన్ రైళ్లలో అధిక ఛార్జీలు వసూలు చేయనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా 40 రైళ్లలో 32 బీహార్ ప్రయాణికులకే అందుబాటులో ఉండనున్నాయి. తెలంగాణకు రెండు రైళ్లను కేటాయించగా, ఏపీకి ఒకటి కూడా కేటాయించలేదు. సికింద్రాబాద్ నుంచి ధానాపూర్ క్లోన్ రైళ్లను తెలంగాణకు కేటాయించగా, సికింద్రాబాద్ తప్పితే ఈ రైలుకు రాష్ట్రంలో ఎక్కడ కూడా హల్టింగ్ లేదు. తక్కువ స్టాపుల్లో ఆపడం వీటి ప్రత్యేకత.
తెలుగు ప్రజలకు ప్రయోజనం
ఇప్పటికే సెప్టెంబర్ 12 నుంచి రైల్వే శాఖ 80 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా వీటికి అదనంగా నడిచే ఈ 40 రైళ్లు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. వీటిలో బెంగళూరు నుంచి ధనాపూర్, ధనాపూర్ నుంచి బెంగళూరు వెళ్లే రైళ్లు విజయవాడ, వరంగల్ స్టేషన్లలో ఆగనున్నాయి. అలాగే సికింద్రాబాద్ నుంచి ధనాపూర్, ధనాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు ఈ క్లోన్ రైళ్లు నడవనున్నాయి.