కొంపముంచుతున్న నిర్లక్ష్యం.. కరోనాపై వైద్యుల కీలక సూచనలు

By సుభాష్  Published on  16 Sep 2020 7:25 AM GMT
కొంపముంచుతున్న నిర్లక్ష్యం.. కరోనాపై వైద్యుల కీలక సూచనలు

ప్రపంచ వ్యాప్తంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం అంతా ఇంతా కాదు. కరోనా సోకినట్లయితే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అలసత్వం చూపిన వారిలో వైరస్‌ రక్త నాళాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఫలితంగా ప్రధాన అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు.

కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా సోకిన తర్వాత రోగి కోలుకునేలోపే వైరస్‌ కొంపముంచే అవకాశం ఉంది. మందులేని మాయరోగంపై జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఈ వైరస్‌ సోకిన కొందరిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతున్నట్లు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపైనే కాకుండా లక్షణాలులేని, స్వల్ప లక్షణాలున్నవారు, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారిలో కూడా వైరస్‌ ప్రభావం చూపుతున్నట్లు, అంతేకాకుండా రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలు కేసుల ద్వారా తెలుస్తోందని వైద్యులు వివరిస్తున్నారు. వైరస్‌ సోకిన వారిలో ఊపిరితిత్తులపై మాత్రమే ప్రభావం ఉంటుందని ముందుగా భావించినా.. అది శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం ఉంటుందని గుర్తించినట్లు పేర్కొంటున్నారు.

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్త..

కరోనా సమయంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణపాయం తప్పదని హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు, బీపీ, అస్తమా, క్యాన్సర్‌, మధుమేహం, ఎయిడ్స్‌, గుండె, కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఈ సమస్యలున్న కరోనా రోగులు తప్పనిసరిగ్గా ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏ చిన్న అనారోగ్యం వచ్చినా.. వెంటనే చికిత్స తీసుకోవాలంటున్నారు.

టాయిలెట్‌కు వెళ్లినప్పుడు జాగ్రత్త..

కరోనా సోకిన చాలా మంది టాయిలెట్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోగి బెడ్ ఉన్న సమయంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గిపోయినా.. వెంటనే చికిత్స చేసే అవకాశం ఉంటుంది. కానీ టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో పడిపోతే లేవలేని పరిస్థితి ఉంటుందని, అలాంటి సమయంలో చికిత్స అందించడంలో ఆలస్యమై మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు వివరిస్తున్నారు. రోగులు రాత్రి సమయంలో్ మూత్ర విసర్జనకు వెళ్లిన సమయంలో సహాయకులను వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.

ఆక్సిజన్‌ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి

హోం ఐసోలేషన్‌లో ఉండే రోగులు ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్‌ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి., ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. కొందరు దీర్ఘకాలిక వ్యాధులున్నా.. వైద్యులకు చెప్పకుండా గోప్పంగా ఉంచుతున్నారని, ఇలాంటిదే ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

రెండోసారి కరోనా సోకడంపై క్లారిటీ ఇచ్చిన ఐసీఎంఆర్‌

భారత్‌లో కరోనా విలయతాండవం..

ఆవిరి పట్టడం వల్ల కరోనాకు చెక్‌ పెట్టవచ్చు: వైద్య నిపుణులు

Next Story