భారత్‌లో కరోనా విలయతాండవం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Sep 2020 5:28 AM GMT
భారత్‌లో కరోనా విలయతాండవం..

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 90వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 90,122 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 50,20,359కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 39,42,361 మంది కోలుకోగా.. 9,95,933 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 1,290 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 82,066కి పెరిగింది. కరోనాతో మరణిస్తున్న వారిలో దాదాపు 70 శాతానికి పైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 78.5శాతం ఉండగా.. మరణాల రేటు 1.63శాతంగా ఉంది.

నిన్న ఒక్కరోజులోనే 11,16,842 శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా 5,94,29,115 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. 66లక్షలకు పైగా కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉంది. ఇక భారత్‌లో కరోనా వ్యాప్తి ఇలాగే కొనసాగితే.. ఈ నెల చివరి నాటికి అమెరికాను దాటేస్తుందని పలువురు శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

Next Story