ప్రేమ పెళ్లి వ్యవహారంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య
By సుభాష్ Published on 12 July 2020 1:03 PM ISTప్రేమ అనే రెండక్షరాలు ఎందరో ప్రాణాలు తీస్తోంది. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నందుకు ఓ కుటుంబం హత్యకు గురైంది. ప్రేమ పెళ్లి వ్యవహారం ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టింది. చివరికి ప్రాణాలు పోయేంత వరకు దారి తీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతీ, యువకుడు బాగానే ఉన్నా.. కుటుంబ సభ్యుల ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురైంది. నమ్మించి పెళ్లి చేసుకున్నాడని అమ్మాయి తరపున బంధువులు అబ్బాయి కుటుంబంపై దాడికి తెగబడ్డారు. కర్రలు, ఇనుప రాడ్లు, కత్తులతో దాడి చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన సంచలనంగా మారింది.
రాయచూర్ జిల్లా సింధనూరులో నలుగురు దారుణ హత్యకు గురయ్యారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ వల్లనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు సావిత్రమ్మ (56), శ్రీదేవి (36), నాగరాజు (35), హనుమేష్ (35)గా గుర్తించారు. ఈ దాడిలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించరాఉ. అయితే ప్రేమ పెళ్లి వ్యవహారంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మౌనేష్ (21), మంజుల (18) అనే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. యువకుడి బంధువులపై యువతి తరపున బంధువులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇరువర్గాలు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసుకోవడంతో ఈ దారుణం చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు.
కాగా, మృతుల్లో మౌనేష్ తల్లి సావిత్రమ్మ, మేన మామలు నాగరాజు, హనుమేష్, అత్త శ్రీదేవిలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు యువతీ, యువకులు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇరు కుటుంబాల్లో ఇష్టం లేకపోవడంతోనే ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.