గాల్లోకి విజయవంతంగా తొలి '3డీ యూఏవీ'.. కానీ..

By అంజి  Published on  12 Feb 2020 4:43 AM GMT
గాల్లోకి విజయవంతంగా తొలి 3డీ యూఏవీ.. కానీ..

హైదరాబాద్‌: తొలి 3డీ ముద్రిత మానవ రహిత యూఏవీ గాల్లోకి ఎగిరింది. సుమారు రెండు నిమిషాల పాటు మానవ రహిత వెహికల్‌ విజయవంతంగా గాలిలో ప్రయాణించింది. ఆ తర్వాత రేడియో సంబంధాలు కోల్పోయి నేలపై కుప్పకూలింది. టీ వర్క్స్‌ గత సంవత్సరం నవంబర్‌లో ఈ 3డీ ముద్రిత మానవ రహిత విమానాన్ని తయారుచేసింది. కొన్ని మైనర్‌ పనుల తర్వాత ఈ విమానం గాల్లోకి ఎగిరింది. మొదటగా గంటకు 80 కి.మీ వేగంతో ఎగిరిన మానవ రహిత విమానం.. వేగం పెంచుకొని, ఆ తర్వాత గంటకు 140 కి.మీ వేగాన్ని అందుకుంది. ఆ తర్వాత రేడియో సంబంధాలు కోల్పోవడంతో విమానం నేలకూలింది.

దీనిపై టీ వర్క్స్‌ స్పందిస్తూ.. తాము ఈ అనుభవంతో మరింత మెరుగైన మానవ రహిత విమానాన్ని తయారు చేస్తామని తెలిపింది. ఎన్నో ప్రత్యేకతలతో యూఏవీ విమానాన్ని రూపొందించారు. ఈ విమానంలో పూర్తిగా 3డీ ముద్రిత విడిభాగాలను వాడారు. 3డీ ముద్రిత విడిభాగాలను పాలీ లాక్టిక్‌ యాసిడ్‌, అక్రిలో నైట్రిల్‌ బయూటడీన్‌ స్టిరీన్‌, హై ఇంపాక్ట్‌ పాలిస్ట్రీన్‌ వంటి పదార్థాలతో తయారు చేశారని ఓ దినపత్రిన తన వార్తలో పేర్కొంది. 200 కి.మీ వేగంతో పయనించే సామర్థ్యంతో రూపొందించిన ఈ 3డీ ముద్రిత యూఏవీ బరువు ఒక్కటిన్నర కిలోలు. కాగా 3డీ ముద్రిత యూఏవీని మరింత మెరుగు పర్చేందుకు టీ వర్క్స్‌ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎయిరోడైనమిక్‌ ధర్మాలను విశ్లేషించి.. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం జరగకుండా యూఏవీని తయారు చేయడమే తమ లక్ష్యమని టీ వర్క్స్‌ చెప్తోంది. 3డీ ముద్రిత యూఏవీ కోసం టీ వర్క్స్‌ చేసిన కృషిని రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ అభినందించారు.

ఎయిరోస్పేస్‌ రంగంలో టీవర్క్స్‌ సంస్థ తన దూకుడు పెంచుతోంది. 3డీ ప్రింటింగ్‌ అప్లికేషన్ల సామర్థ్యం, పనితీరులపై వరుస పరిశోధనలు చేస్తోంది. మెకానికల్‌, ఎలక్రోమెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాలకు సంబంధించి టీ వర్క్స్‌కు దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైప్‌ సెంటర్‌గా పేరుంది. గతంలో ఎయిర్‌క్రాప్ట్‌ల విడిభాగాలు తయారు చేసేందుకు వందల గంటల సమయం పట్టేది. ఇప్పడు కంప్యూటర్‌ టెక్నాలజీ వల్ల డిజైనింగ్‌, 3డీ ప్రింటర్ల ద్వారా సులభంగా ప్రోటోటైప్‌లను తయారుచేస్తున్నారు. 3డీ ముద్రిత యూఏవీలో విడిభాగాలను అమర్చేందుకు ఎలాంటి నట్లు, బోల్టులు వాడలేదు. కేవలం తేనెపట్టులో అమర్చినట్లు బిగించి యూఏవీని తయారు చేశారు.

Next Story