మావోలకు ఎదురు దెబ్బ.. 32 మంది లొంగుబాటు

By సుభాష్  Published on  26 Oct 2020 9:35 AM GMT
మావోలకు ఎదురు దెబ్బ.. 32 మంది లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులకు అడ్డాగా ఉన్న దంతెవాడలో భారీ సంఖ్యలో మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన 32 మంది లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో 10 మంది మహిళలు ఉన్నట్లు చెప్పారు. మావోయిస్టు పార్టీ డొల్ల సిద్దాంతాలతో విసిగి పోలీసులు ప్రకటించిన పునరావాస కార్యక్రమానికి ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ వెల్లడించారు. లొంగిపోయిన వారు ఆదివాసీ కిసాన్‌ మజ్దూర్‌ సంఘటన్‌, క్రాంతికారి మహిళా ఆదివాసీ సంఘటన్‌, చేత్న నాట్య మండలి, జనతానా సర్కార్‌ గ్రూప్స్‌ తదితర విభాగాలకు చెందిన వారున్నారని తెలిపారు.

తాజాగా లొంగిపోయిన వారిలో పలువురికి గతంలో పోలీసు, పోలింగ్‌ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని, అందులో నలుగురిపై లక్ష రూపాయల చొప్పున రివార్డు కూడా ఉందని ఎస్పీ వెల్లడించారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద రూ.10వేల చొప్పున అందించారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీని అందించనున్నారు. ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకు 150 మంది వరకు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Next Story
Share it