జీహెచ్‌ఎంసీలో కరోనా ఉధృతి.. 31 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2020 8:04 AM GMT
జీహెచ్‌ఎంసీలో కరోనా ఉధృతి.. 31 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌ నగరంలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజుకు దాదాపు వందకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. డాక్టర్లు ముందు వరుసలో నిలబడి ఈ మహమ్మారి పై పోరాటం చేస్తున్నారు. ప్రాణాలు కాపాడే డాక్టర్లు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది.గత వారం రోజుల వ్యవధిలోనే నగరంలో 31 మంది వైద్యులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు కరోనా బారీన పడ్డారు.

నిమ్స్‌ ఆస్పత్రి కార్డియాలజీ విభాగంలో పని చేసే నలుగురు డాక్టర్లకు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లకు కోవిడ్ సోకిందని బుధవారం నిర్ధారణ అయ్యింది. పేట్లబురుజు ఆస్పత్రిలో గైనకాలజీ విభాగంలో పని చేసే ఒక ప్రొఫెసర్, ఇద్దరు రెసిడెంట్ డాక్టర్లు కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో అనస్థీషియా విభాగంలో పని చేసే పీజీ డాక్టర్, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ఇద్దరు పీజీ రెసిడెంట్లు, నలుగురు హౌస్ సర్జన్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఈ ఆస్పత్రి నుంచి 20 మంది డాక్టర్ల శాంపిళ్లను సేకరించి టెస్టులకు పంపించారు. వారి రిపోర్ట్స్ రావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో తమకు కూడా కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. వైద్య సిబ్బంది నుంచి ఇతరులకు కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులే వైరస్ కు హాట్ స్పాట్స్ గా మారుతున్నాయన్న ఆందోళన పెరిగిపోతున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ, ఈ సమావేశం నిర్వహించి, తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది.

హెల్త్ వర్కర్లు, జూనియర్ డాక్టర్ల బృందం తెలంగాణ వైద్య మంత్రి ఈటల రాజేందర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లను కలిసి, తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పీజీ తుది సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని, అందరు హెల్త్ కేర్ వర్కర్లకు తరచూ కరోనా టెస్ట్ చేయించాలని, పాజిటివ్ వచ్చిన వారిని విధుల నుంచి తప్పించి, క్వారంటైన్ లో ఉంచి వైద్య చికిత్సలు అందించాలని వారు డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,020కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 99 మంది మృతి చెందారు. రాష్ట్రంలో నమోదు అవుతున్న అత్యధిక కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Next Story