ఒక్క మ్యాచ్.. 3 జట్లు.. 36 ఓవర్లు.. సరికొత్త ఫార్మాట్
By తోట వంశీ కుమార్ Published on 18 Jun 2020 7:10 AM GMTఇప్పటి వరకు క్రికెట్‌లో టెస్టులు, వన్డేలు, టీ20, టీ10 వంటి ఫార్మాట్లను చూశాం. అయితే.. ఏ ఫార్మాట్ తీసుకున్న రెండు జట్లు మాత్రమే ఆడుతాయి. మరీ మూడు జట్లు ఒకే సారి తలపడితే..? అవును ఇది నిజమే.. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్‌ఏ) ఈ రకమైన కొత్త ఫార్మాట్‌కు తీసుకువచ్చింది. ఒకే మ్యాచ్‌లో మూడు జట్లు పాల్గొంటాయి. చివరికి ఒకే జట్టు విజేతగా నిలుస్తుంది. ఈ ఫార్మాట్ పేరు 3టీమ్ క్రికెట్(3టీసీ). అయితే.. ఒక్కో జట్టులో 11 ప్లేయర్లకు బదులు 8 మంది ప్లేయర్లు ఆడతారు. మ్యాచ్‌కు 36 ఓవర్లు ఉంటాయి.
ఒక్క మ్యాచ్.. 3 జట్లు.. 36 ఓవర్లు
రెండు అర్థబాగాలుగా ఈ మ్యాచ్ ను ఆడిస్తారు. మొదటి అర్థభాగంలో 18 ఓవర్లు, రెండో అర్థబాగంలో 18 ఓవర్ల చొప్పున మ్యాచ్‌ను నిర్వహిస్తారు. తొలి అర్థభాగంలో టీమ్ ఏ టీమ్ బితో ఆరు ఓవర్లు ఆడుతుంది. సెకండాఫ్‌లో టీమ్ ఏ టీమ్ సితో మరో ఆరు ఓవర్లు మ్యాచ్ ఆడుతుంది. ఇలా ప్రతి జట్టు 12 ఓవర్లు బ్యాటింగ్, బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. సాధారణ మ్యాచ్‌లో టాస్ వేస్తారు. ఇక్కడ మూడు జట్లు ఆడుతాయి కాబట్టి ఏ ఇద్దరు మొదట మ్యాచ్ ఆడాలి ఏ జట్టు డగ్ అవుట్‌లో కూర్చోవాలో డ్రా పద్దతిలో నిర్ణయిస్తారు. ఫస్టాప్‌లో అత్యధిక స్కోర్ చేసిన టీమ్ సెకండాఫ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తుంది. రెండు జట్లు స్కోర్లు సమమైతే.. ఫస్టాఫ్‌లో ఆడిని స్థానాలను రివర్స్ చేస్తారు అంటే మొదట బౌలింగ్ చేసిన టీమ్‌తో బ్యాటింగ్.. బ్యాటింగ్ చేసిన టీమ్‌తో బౌలింగ్ చేయిస్తారు.
ఒక జట్టు ఏడో వికెట్ పడగానే ఫస్టాఫ్‌లో అక్కడితోనే ఆ ఇన్నింగ్స్ ముగుస్తుంది. కానీ.. సెకండాఫ్‌లో ఏడో వికెట్ పడిన తర్వాత కూడా చివరి బ్యాట్స్‌మన్ ఒక్కడే ఇన్నింగ్స్ కొనసాగించవచ్చు. అయితే.. 2, 4, 6 మాత్రమే చేసేందుకు అనుమతిస్తారు. అంటే 2 రన్స్ తీయొచ్చు లేదా.. బౌండరీ బాదేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. సింగిల్స్‌కు అవకాశం ఉండదు. టీమ్ ఏ టీమ్ బి, టీమ్ సి కి కలిపి 12 ఓవర్లు బౌలింగ్ చేయాలి. అయితే ఒక కొత్త బంతిని మాత్రమే ఇస్తారు. మరో బంతిని అనుమతించరు. ఇక ఒక బౌలర్ గరిష్టంగా మూడు ఓవర్లు బౌలింగ్ చేయొచ్చు. చివరకు రెండు భాగాల్లో కలిపి ఎక్కువ రన్స్ చేసిన జట్టు విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ దక్కించుకుంటుంది. సెకండ్ ప్లేస్‌కు సిల్వర్, థర్డ్ ప్లేస్‌కు బ్రాంజ్ మెడల్ ఇస్తారు. ఒకవేళ రెండు జట్లు సమాన పరుగులు చేస్తే సూపర్ ఓవర్ ఆడించి గోల్డ్ మెడలిస్ట్ నిర్ణయిస్తారు.ఈ నెల 27న కొత్త ఫార్మాట్‌లో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ప్లాన్ చేసింది. ఖాళీ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించనుంది. ఈ పోరుకు సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్ ఆతిథ్యం ఇవ్వనుంది. కొత్త ఫార్మాట్‌లో ఈ మ్యాచ్‌ను చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.