సెప్టెంబర్‌ 26 నుంచి ఐపీఎల్‌..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jun 2020 6:00 AM GMT
సెప్టెంబర్‌ 26 నుంచి ఐపీఎల్‌..!

ఐపీఎల్‌ అభిమానులకు నిజంగా శుభవార్త ఇది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 13వ సీజన్‌ కరోనా కారణంగా తొలుత ఏప్రిల్‌ 15కు వాయిదా పడింది. దేశంలో లాక్‌డౌన్‌ను కొనసాగించడంతో అనంతరం నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ సారి ఐపీఎల్‌ రద్దు అయితే.. బీసీసీఐ రూ.4వేల కోట్లు నష్టపోనుంది. దీంతో ఈ ఏడాది ఎలాగైనా సరే ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది. తాజాగా ఐపీఎల్‌పై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.

అక్టోబర్‌ 13 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచ కప్‌ పై నీలినీడలు కమ్ముకోవడంతో ఆ విండోలో ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. సెప్టెంబర్‌ 26 నుంచి నవంబర్‌ 8 వరకు ఐపీఎల్‌ 13వ సీజన్‌ను నిర్వహించేందుకు ఓ షెడ్యూల్‌ను రూపొందించారట. అయితే.. దేశంలో సెప్టెంబర్‌ లో వర్షాకాలం కావడంతో మ్యాచ్‌లకు అంతరాయం కలిగే అవకాశం ఉండడంతో విదేశాల్లో ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తోందిన ఓ ప్రాంచైజీ ప్రతినిధి చెప్పాడు. ప్రస్తుతం ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కరోనా ముప్పుతో ప్రేక్షకులను స్టేడియాల్లో అనుమతించే అవకాశం తక్కువని, అయితే.. టీవీల్లో మాత్రం ఐపీఎల్‌కు మ్యాచ్‌లకు రికార్డు స్థాయిలో చూస్తారని అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు ప్రతి జట్టు 14 మ్యాచ్‌లను ఆడేది. ఏడు సొంత మైదానంలో ఆడగా.. మరో ఏడు మ్యాచులను ప్రత్యర్థి మైదానంలో ఆడేవారు. కరోనా కారణంగా ఈ సంప్రదాయం మారనుంది. కేవలం రెండు లేదా మూడు స్టేడియాల్లో మొత్తం మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్‌ పై ఐసీసీ తుది నిర్ణయం తీసుకోగానే.. ఐపీఎల్‌ను షెడ్యూల్‌ ను ప్రకటించే అవకాశం ఉంది.

Next Story