సంచలన నిర్ణయం: ఛత్తీస్‌గఢ్‌లో మరో మూడు నెలల పాటు కర్ఫ్యూ పొడిగింపు

By సుభాష్  Published on  18 May 2020 2:02 PM GMT
సంచలన నిర్ణయం: ఛత్తీస్‌గఢ్‌లో మరో మూడు నెలల పాటు కర్ఫ్యూ పొడిగింపు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే మూడు దశలుగా కొనసాగిన లాక్‌డౌన్‌ ఈ రోజు నుంచి మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక కరోనా కట్టడిలో భాగంగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉండిపోయింది. కాగా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మరో మూడు నెలల పాటు కర్ఫ్యూ పొడిగించారు.

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకే రాష్ట్ర మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. చాలా ప్రాంతాల్లో కరోనా ప్రభావం పెరిగే అవకాశాలుండటంతో కలెక్టర్లు అందరు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని, కర్ఫ్యూను పొడిగించినట్లు ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వం పేర్కొంది. అయితే ఆదివారం నాడు కొత్తగా 25 కరోనా కేసలు నమోదు కావడంతో ఆ సంఖ్య 92కు చేరింది. 32 మంది బాధితులు చికిత్స పొందుతుండగా, 59 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇప్పటి వరకూ ఎక్కడ ఎన్ని కేసులు.. ఎన్ని మరణాలు

కాగా, భారత్‌లో ఉగ్రరూపం దాల్చుతున్న కరోనా.. గడిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 5242 పాజిటివ్ కేసులు న‌మోదు కావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకూ భారత్‌లో 157 మంది మ‌ర‌ణించారు. ఒకే రోజు ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో మరింత టెన్షన్‌ పుట్టుకొచ్చేలా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో 96,169 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,029 మంది మరణించారు. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో 36,824 మంది డిశ్చార్జి కాగా.. 56,316 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

క‌రోనా కేసులు ఎక్కువగా న‌మోదు అవుతున్న రాష్ట్రాల్లో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉంది. గ‌డిచిన 24 గంట్ల‌లో 2437 కేసులు నమోదయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ రాష్ట్రంలో 33,053 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. 1198 మంది మృతి చెందారు. త‌మిళ‌నాడులో 11,224 కేసులు న‌మోదు కాగా.. 78 మంది మరణించారు. ఢిల్లీలో10,054 కేసులు నమోదు కాగా, 160 మంది మరణించారు. గుజ‌రాత్‌లో 11,379 కేసులు నమోదు కాగా, 659 మంది మృతి చెందారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 4,977 కేసులు న‌మోదు కాగా 238 మంది మృతి చెందారు. ఇక రాజ‌స్థాన్ లో 5,202 కేసులు నమోదు కాగా, 131 మంది మృతి చెందారు. ఏపీలో 2,407 కేసులు న‌మోదు, 50 మంది మరణించారు. తెలంగాణ‌లో 1,551 కేసులు న‌మోదు కాగా, 34 మంది మ‌ర‌ణించారు. ఇలా రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో నమోదు కావడంతో లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగించింది కేంద్రం.

Next Story
Share it