జూలై 2న తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చించే కీలక అంశాలు ఇవే
By సుభాష్ Published on 30 Jun 2020 11:29 AM ISTతెలంగాణలో కరోనా వైరస్ కాలరాస్తోంది. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం కరోనా కొరలు చాస్తోంది. పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 2న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించాలని భారీ ఎత్తున డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ పరిధిలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ అత్యంత కఠినంగా విధించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించడంతో కేబినెట్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
లాక్‌డౌన్‌లో కర్ఫ్యూ మాత్రం కఠినంగా విధించాలని డిమాండ్ పెరుగుతోంది. రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే నిత్యావసరాల కోసం సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక జూలై 3 నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్ విధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక లాక్‌డౌన్‌తో పాటు తొందరగా ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చివేసేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం.