హైదరాబాద్‌: బర్త్‌డే పార్టీ కొంప ముంచింది.. 23 మందికి కరోనా

By సుభాష్  Published on  16 May 2020 8:57 PM IST
హైదరాబాద్‌: బర్త్‌డే పార్టీ కొంప ముంచింది.. 23 మందికి కరోనా

హైదరాబాద్‌లో జరిగిన ఓ బర్త్‌డే పార్టీ కారణంగా 23 మందికి కరోనా పాజిటివ్‌ తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. మాదన్నపేటలోని అపార్ట్‌ మెంట్‌లో ఓ బర్త్‌డే పార్టీ కారణంగా 23 మందికి కరోనా పాజిటివ్‌ తేలింది. ఆ పుట్టిన రోజు వేడుకకు హాజరైన మొత్తం 23 మందికి కరోనా తేలినట్లు అధికారులు తేల్చారు.

కాగా, కరోనా వైరస్‌పై భౌతిక దూరం పాటించకుంటే ఎన్ని అనర్థాలు జరుగుతాయో పోలీసులు, అధికారులు ఎన్నిసార్లు చెబుతున్నా.. పెడచెవిన పెడుతున్నారు. భౌతిక దూరం పాటించాలని పోలీసులు భయపెట్టి.. దండం పెట్టి.. ఇలా ఎన్నో రకాలుగా ప్రచారం చేస్తూ చెబుతున్నా.. కొందరు పట్టించుకోకపోవడంతో కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమనే చెప్పాలి. దీంతోపై పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి హైదరాబాద్‌లోని మాదన్నపేట పుట్టిన రోజు వేడుకనే నిదర్శనంగా నిలుస్తోంది. వీరందరికి కూడా కరోనా సోకినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. అయితే మాదన్నపేటను కంటోన్మెంట్‌ జోన్‌గా మార్చడం వల్ల స్థానికుల్లో మరింత ఆందోళన నెలకొంది.

కాగా, మాదన్నపేటలోని ఆపార్ట్‌మెంట్‌లో ఓప్లాట్‌లో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అంతేకాదు ఆ ఇంట్లో పని చేసే పని మనిషికి కూడా కరోనా సోకింది. అదే అపార్ట్‌మెంట్‌లో రెండో అంతస్తులో నివసిస్తున్న ఓ వ్యక్తికి ఈనెల 10వ తేదీన కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇక బుధవారం అదే అపార్ట్‌మెంట్‌లో సాఫ్ట్ వేర్‌ ఉద్యోగికి కూడా కరోనా వచ్చింది. దీంతో అధికారులు అతడి భార్య, కూతురుతో పాటు 11 మందిని క్వారంటైన్‌కు తరలించారు. మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ రాగా, ఆ అపార్ట్‌మెంట్‌లో మొత్తం 50 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 23 మందికి పాజిటివ్‌ రాగా, మరో ఐదుగురి రిపోర్టులో రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Next Story