13ఏళ్ల క్రితం తప్పిపోయాడు.. టిక్‌టాక్‌ వీడియోతో ఇంటికిచేరాడు!

By Newsmeter.Network  Published on  16 May 2020 8:06 AM GMT
13ఏళ్ల క్రితం తప్పిపోయాడు.. టిక్‌టాక్‌ వీడియోతో ఇంటికిచేరాడు!

కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. సామాజిక మాధ్యమాలతో కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా యువత టిక్‌టాక్‌, ఫేస్‌ బుక్‌, హలో వంటి యాప్‌లలో ఎక్కువ కాలక్షేపం చేస్తున్నారు. వీటి వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నా మంచికూడా జరుగుతుంది. తాజాగా టిక్‌టాక్‌ ద్వారా పదమూడేళ్ల క్రితం అదృశ్యమైన మతిస్థిమితం లేని వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం పెద్దతండాలో చంద్రునాయక్‌ (45) అనే మతిస్థిమితంలేని వ్యక్తి 2007లో తప్పిపోయాడు. అతనికి భార్య మరోనా, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. పదమూడేళ్ల క్రితం తప్పిపోయిన చంద్రునాయక్‌ నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్లకు చేరుకున్నారు.

Also Read :మొబైల్‌ ఫోన్‌ల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి!?

చంద్రునాయక్‌ ఇంటినుంచి తప్పిపోవటంతో వారి కుటుంబ సభ్యులు అన్నిచోట్ల వెతికారు. కానీ ఆచూకీ తెలియకపోవటంతో చనిపోయాడని భావించారు. పదమూడేళ్లుగా గుడిగండ్లలోనే ఊంటూ చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కట్టెలు కొట్టడం, నీళ్లు తేవడం వంటి పనులు చేసేవాడు. అందుకు వారు భోజనం పట్టేవారు. గడ్డం పెరిగినప్పుడు గ్రామస్తులు ఎవరైనా పిలిచి క్షవరం చేయించేవారు. ఊరికి దగ్గరలో ఉన్న ఊళ్లో ఉన్న బోర్ల వద్ద అప్పుడప్పుడు స్నానం చేసేవాడు. రాత్రివేళ ఊర్లోని సవారమ్మగుడి, హనుమాన్‌గుడి, ఊర్లోని ప్రైమరీ, హైస్కూళ్ల వద్ద లేదంటే చెట్ల కింద పడుకునేవాడు. ఎవరైనా వివరాలు అడిగితే ఒక్కోసారి చెప్పేవాడని, ఒక్కోసారి సరిగా చెప్పేవాడు కాదని గ్రామస్తులు తెలిపారు.

Also Read :24గంటల్లోనే 3,970 పాజిటివ్‌ కేసులు, 103 మంది మృతి

ఇటీవల గ్రామానికి చెందిన రామాంజనేయులు చంద్రునాయక్‌ వివరాలు అడుగుతూ వీడియోరికార్డు చేశాడు. దానిని టిక్‌టాక్‌లో పోస్టు చేశాడు. టిక్‌టాక్‌లో వీడియో చూసిన పెద్దతండా శంకర్‌ ఆ వీడియోను చంద్రునాయక్‌ కుటుంబానికి చూపించారు. అతని భార్య, మరోని అతను తన భర్తేనని గుర్తించింది. పోలీసుల సహాయంతో అతని భార్య మరోని, కుమారుడు శ్రీను, కూతురు లక్ష్మీ గుడిగండ్ల వెళ్లి చంద్రునాయక్‌ను కలిశారు. అనంతరం పోలీసులు చంద్రుకు వైద్య పరీక్షలు చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 13ఏళ్ల తరువాత కుటుంబ పెద్ద తిరిగిరావటంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story