దేశంలో కరోనా కరాళనృత్యం.. 24గంటల్లో 22,771 పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 4 July 2020 10:51 AM ISTభారత్‌లో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. గత కొద్ది రోజులుగా ప్రతి రోజు 19వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 22,771 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 442 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315కు చేరగా.. 18,655 మంది మరణించారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 3,94,227 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 2,35,433 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 95,40,132 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,42,383 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది. దేశంలో అత్యధిక పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. ఆ రాష్ట్రంలో 1,92,990 కేసులు నమోదు కాగా.. 8376 మంది మృత్యువాతపడ్డారు. తమిళనాడులో లక్షా రెండు వేల కేసులు నమోదు కాగా.. 1385 మంది చనిపోయారు. ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ 4వ స్థానంలో కొనసాగుతోంది.