బాబోయ్ 2020.. ఏం శాపం త‌గిలింద‌య్యా

By సుభాష్  Published on  28 May 2020 7:23 AM GMT
బాబోయ్ 2020.. ఏం శాపం త‌గిలింద‌య్యా

కొత్త ఏడాది వ‌స్తోంద‌న‌గానే కొంగొత్త ఆశ‌ల‌తో రెడీ అయిపోతారు అంద‌రూ. పోయినేడాది ఏదో అలా గ‌డిచిపోయింది, ఏమీ క‌లిసి రాలేదు. కొత్త ఏడాదిలో అయినా అంతా మంచే జ‌ర‌గాలి అనుకుంటూ ఏదేదో చేసెయ్యాలి అని ప్ర‌ణాళిక‌లు వేసుకుని రెడీ అయిపోతారు. అలా ప్లాన్ చేసుకున్న వాళ్లంద‌రికీ 2020 చుక్క‌లు చూపిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రికీ 2020 ఓ చేదు జ్ఞాప‌కం కాబోతోంద‌న్న‌ది స్ప‌ష్టం. ఇండియా ప‌రిస్థితి చెప్పాల్సిన ప‌ని లేదు. క‌రోనా వైర‌స్ ధాటికి ప్ర‌భావితం కాని, ఎంతో కొంత న‌ష్ట‌పోని మ‌నిషి దేశంలో లేడంటే అతిశ‌యోక్తి కాదేమో. దేశాన్ని, దేశ జ‌నాభాను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది క‌రోనా. ఐతే ఈ క‌ష్టాలు చాల‌వ‌న్న‌ట్లు మ‌రిన్ని స‌మ‌స్య‌లు ఈ ఏడాదే జ‌నాల్ని ముంచెత్తుతున్నాయి.

క‌రోనాతో ప‌డుతున్న క‌ష్టాలు చాల‌వ‌న్న‌ట్లు విశాఖ‌ప‌ట్నం గ్యాస్ లీక్ ఉదంతం ప‌న్నెండు మంది ప్రాణాలు తీసుకుంది. వంద‌ల మందిని అస్వ‌స్థుల్ని చేసింది. తెలుగు రాష్ట్రాల వారిని ఈ ఉదంతం క‌ల‌చి వేసింది. ఇదే స‌మ‌యంలో దేశ‌వ్యాప్తంగా ఇలాంటి ప్ర‌మాదాలు మ‌రిన్ని చోటు చేసుకున్నాయి. ఉత్త‌రాఖండ్ అగ్ని ప్ర‌మాదం ఆ రాష్ట్రంలో ఎంతోమందిని నిరాశ్ర‌యుల్ని చేసింది. ప్రాణాలు తీసుకుంది. మ‌రోవైపు అంఫాన్ తుఫాను వ‌చ్చి ఇండియాలో తీర ప్రాంతాల్లో ఉన్న అనేక రాష్ట్రాల్ని అల్లాడించింది.

ఏపీలో కూడా కొన్ని ప్రాంతాలు తుపాను ధాటికి కుదేల‌య్యాయి. ఇవ‌న్నీ చాల‌వ‌న్న‌ట్లు ఇప్పుడు మిడ‌త‌ల దాడితో కొన్ని రాష్ట్రాలు బెంబేలెత్తుతున్నాయి. వాటి వ‌ల్ల వంద‌ల ఎక‌రాల్లో పంట‌లు నాశ‌న‌మ‌య్యాయి. మిడ‌త‌ల ప్ర‌భావానికి సంబంధించిన దృశ్యాలు చూస్తే ఒళ్లు గ‌గుర్పొడుస్తోంది. వీటి ప్ర‌భావం మ‌రిన్ని రాష్ట్రాల‌కు విస్త‌రిస్తుంద‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మొత్తానికి కొన్ని నెల‌లుగా ప‌రిణామాలు చూస్తుంటే.. ఏదో శాపం ఉన్న‌ట్లుగా 2020 అంద‌రితో ర‌ఫ్ఫాడుకుంటోంద‌నిపిస్తోంది.

Next Story