టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వాయిదా..! బీసీసీఐ ఒప్పుకుంటేనే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 March 2020 7:04 PM IST
టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వాయిదా..! బీసీసీఐ ఒప్పుకుంటేనే..?

క‌రోనా ముప్పుతో ప‌లు క్రీడా టోర్నీలు ర‌ద్దుకాదా.. మ‌రికొన్ని వాయిదా ప‌డ్డాయి. దీంతో క్రీడాకారులంతా కుటుంబ స‌భ్యుల‌తో హాయిగా కాలం గ‌డుపుతున్నారు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ వాయిదాతో నిరాశ చెందిన క్రికెట్ ప్రేమికులు టీ20 వ‌రల్డ్ జ‌రుగుతుందిగా చూద్దాంలే అని అనుకున్నారు. అయితే ఇప్పుడు వారికి ఓ బ్యాడ్ న్యూస్.

ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగే టీ20 ప్ర‌పంచ క‌ప్ వాయిదా ప‌డ‌నుందా..? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. షెడ్యూల్ ప్ర‌కారం ఈ ఏడాది అక్టోబ‌ర్‌-న‌వంబ‌ర్ నెల‌ల్లో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను వ‌చ్చే ఏడాదికి వాయిదా వేయాల‌ని అంత‌ర్జాతీయ క్రికెట్ కౌనిల్స్ (ఐసీసీ) బావిస్తోంది.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌కి ఆతిథ్యమివ్వడంపై స్పష్టత ఇవ్వలేకపోతోంది. దీంతో ఐసీసీ పునాలోచనలో పడింది. ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని చూస్తోంది. అయితే.. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. 2021 టీ20 వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులు ప్రస్తుతం భారత్ వద్ద ఉన్నాయి. దీంతో వచ్చే ఏడాది ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తే..? అప్పుడు భారత్‌ని ఏమని బుజ్జగించాలో..? ఇప్పుడు ఐసీసీకి పాలుపోవడం లేదు. ఎందుకంటే.. గత మూడేళ్లుగా ఐసీసీ, బీసీసీఐ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోన్న సంగ‌తి తెలిసిందే.

దీంతో ఎలాగైనా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ను బుజ్జ‌గించి వ‌చ్చే ఏడాదికి ప్ర‌పంచ‌క‌ప్ ను వాయిదా వేయాల‌ని ఐసీసీ ప‌ట్టుద‌ల‌తో ఉంది. టీ20 వరల్డ్‌కప్ వాయిదా విషయమై ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో చర్చిస్తున్న ఐసీసీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలతోనూ చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వచ్చే ఏడాది ఆస్ట్రేలియాకి టీ20 వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కుల్ని ఇస్తే.. ఆ తర్వాత 2022లో భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ నిర్వహించకోచ్చని ప్రతిపాదించే అవకాశం ఉంది. ఎందుకంటే.. 2022లో ఎలాంటి ఐసీసీ టోర్నీలు లేవు. ఇప్ప‌టికే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌-13వ సీజ‌న్ వాయిదా వ‌ల్ల న‌ష్ట‌పోయిన బీసీసీఐ ఐసీసీ ప్ర‌తిపాద‌న‌కు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Next Story