2019ని వణికించిన ఘోరాలు, దారుణాలు
By సుభాష్ Published on 27 Dec 2019 9:31 AM IST2019 యేడాది నేరాలు, ప్రమాదాలు తెలుగు రాష్ట్రాలను వణికించాయి. జాతీయ స్థాయిలోనే కాదు.. ఏకంగా అంతర్జాతీయ స్థాయి పత్రికల్లో పతాక శీర్షికల వార్తలకు కేంద్రబిందువులయ్యాయి. ప్రధానంగా అమ్మాయిలపై, పసికందులపై కామాంధుల రాక్షసత్వం, అమాయకులను బలి తీసుకున్న సంఘటనలు ప్రకంపనలు సృష్టించాయి. తెలుగు రాష్ట్రాలంటేనే భయం పుట్టే సంఘటనలు నమోదయ్యాయి. ఇక.. పదుల సంఖ్యలో ప్రజలను బలి తీసుకున్న ప్రమాదం కూడా తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. దిశ సంఘటనతో పార్లమెంటే దద్దరిల్లింది. అదే సమయంలో వరంగల్‌లో మరో యువతి అదే తరహాలో దారుణ హత్యకు గురికావడం, కొమురం భీం జిల్లాలోనూ ఇంకో మహిళ.. కామాంధుల దురాగతానిఇక బలికావడం తీవ్ర చర్చను లేవనెత్తాయి. ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఇక.. వరంగల్‌లో ఏడేళ్ల పసిపాపపై అత్యాచారం, హత్య సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. హాజీపూర్‌లో అభంశుభం తెలియని విద్యార్థినులను ఓబావిలో బలితీసుకున్న సీరియల్ కిల్లర్ ఉదంతం కూడా అందరినీ కంటతడి పెట్టించింది. ఇక.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ యేడాది జరిగిన అత్యంతఘోరమైన పడవ ప్రమాదం ఏపీతోపాటు.. తెలంగాణ వాసులను కూడా జలసమాధి చేసింది.
దిశ ప్రకంపనలు :
నవంబర్ 26వ తేదీన హైదరాబాద్ శివారులోని శంషాబాద్ టోల్‌గేట్ సమీపంలో జరిగిన దిశ దుర్ఘటన తీవ్ర కలకలం రేపింది. టోల్‌ప్లాజా దగ్గర తన స్కూటీని పార్క్ చేసేందుకు సిబ్బంది అంగీకరించకపోవడంతో అవుటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని లారీలు నిలిపే ప్రదేశంలో స్కూటీని పార్క్‌చేసి గచ్చిబౌలి వెళ్లింది వెటర్నరీ డాక్టర్ దిశ. ఆమె తిరిగి వచ్చేసరికి రాత్రి పొద్దుపోయింది. అయితే.. దిశ స్కూటీని పార్క్ చేయడం గమనించిన కొందరు లారీడ్రైవర్లు ఆ స్కూటీకి పంక్చర్ చేసి ఆమె తిరిగి వచ్చిన తర్వాత సాయం చేస్తామని బుకాయించి అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీళ్ల దుర్మార్గానికి ప్రాణాలు కోల్పోయిన దిశ మృతదేహాన్ని చటాన్‌పల్లి సమీపంలోకి తీసుకెళ్లి.. ఓ అండర్‌పాస్ కింద కిరోసిన్ పోసి దహనం చేశారు. దుర్మార్గుల ఉచ్చులో చిక్కుకునే ముందు బాధితురాలు తన చెల్లెలితో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ అందరి గుండెలనూ పిండేసింది.
దిశ హత్యకేసులో పోలీసులు 48 గంటల్లోనే నిందితులను గుర్తించడంతో పాటు అరెస్ట్ చేశారు. మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో సత్వర న్యాయం డిమాండ్ దేశమంతటా వినిపించింది. సామాన్య ప్రజలే కాదు.. ప్రజా ప్రతినిధులు, సినీ, సామాజిక రంగాల ప్రముఖులు అందరినోటా ఉరిశిక్ష, ఎన్‌కౌంటర్ అన్నమాటలే వినిపించాయి. సామాజిక మాధ్యమాలు కోడైకూశాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది.అదే సమయంలో పోలీసులు నలుగురు నిందితులనూ ఎన్‌కౌంటర్ చేశారు. ఎన్‌కౌంటర్ తర్వాత మాత్రం ఇది మానవ హక్కుల ఉల్లంఘన అంటూ విభిన్న అభిప్రాయాలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నిందితులను పోలీసులు కాల్చిచంపడమేంటన్న నిలదీతలు ఎదురయ్యాయి. కేవలం వారం, పది రోజుల వ్యవధిలోనే ఇలాంటి పరస్పర విభిన్న అభిప్రాయాలు, డిమాండ్లు దిశ కేసులో పోలీసులకే కాదు..తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా తలలు పట్టుకునేలా చేశాయి. పిటిషన్ల మీద పిటిషన్లు, కేసుల మీద కేసులు, కోర్టుల్లో విచారణలు, జాతీయ మానవహక్కుల కమిషన్ దర్యాప్తు ఇలా.. దిశ కేసు తెలంగాణను కుదిపేసింది. ఈ పరిస్థితులను గ్రహించిన సుప్రీంకోర్టు దిశ కేసుపై త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. విశ్రాంత న్యాయమూర్తులు సిర్పుర్కార్, రేఖ, సీబీఐ మాజీ అధికారి కార్తికేయన్‌లతో కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ నివేదిక ఇచ్చేదాకా అన్నికోర్టుల్లోనూ ఈ కేసుపై జరుగుతున్న విచారణలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా దిశ కేసులో దేశవ్యాప్తంగా పలు కోణాల్లో జరుగుతున్న చర్చలకు ఈ పరిణామం ఫుల్‌స్టాప్ పెట్టింది.
గుండెలను పిండేసిన వరంగల్ ఘోరం :
వరంగల్‌లో గత జూన్ 18వ తేదీ రాత్రి జరిగిన ఘోరం అందరి గుండెలనూ పిండేసింది. పుట్టింటికి వచ్చిన ఓ మహిళ.. వేసవి కాలం కావడంతో డాబాపైన మిగతా కుటుంబసభ్యులతో కలిసి నిద్రించింది. ఆ మహిళ ఒళ్లో ఉన్న ఏడునెలల పసిపాపను ప్రవీణ్ అనే యువకుడు అపహరించుకు వెళ్లి అత్యంత రాక్షసంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. శిశువు గుక్కపెట్టి ఏడుస్తున్నా వదలని ఆ కామాంధుడి చేష్టలకు చిన్నారి చనిపోయింది. స్థానికులు ప్రవీణ్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన వరంగల్ నగారన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. పోలీసులు నెలరోజుల్లోపే చార్జిషీట్ దాఖలు చేశారు. న్యాయమూర్తి నెలా పదిహేను రోజుల్లోపే నిందితుడికి ఉరిశిక్ష విధించారు. అయితే.. నిందితుడు ప్రవీణ్ హైకోర్టును ఆశ్రయించడంతో ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. ఇప్పుడు దిశ దుర్ఘటన తర్వాత వరంగల్ పోలీసులు మరోసారి యాక్టివ్ అయ్యారు. ప్రవీణ్ ఉరిశిక్షను రద్దుచేసిన హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు వరంగల్ సీపీ డాక్టర్ రవీందర్ ప్రకటించారు.
మెలిపెట్టిన హాజీపూర్ హత్యలు :
ఇక.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అతిసమీపంలో ఉన్న హాజీపూర్ గ్రామంలో విద్యార్థినుల వరుస హత్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. శ్రీనివాస్‌రెడ్డి అనే సైకో ముగ్గురు బాలికలపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి వాళ్లను తన వ్యవసాయబావిలోనే పూడ్చిపెట్టాడు. ఈయేడాది ఏప్రిల్‌లో శ్రీనివాస్‌రెడ్డి దారుణాలు వెలుగుచూశాయి. తొలుత కాలేజీకి వెళ్లివస్తున్న విద్యార్థిని శవం బావిలో దొరకగా.. ఆ తర్వాత అంతకుముందు అదృశ్యమైన మరో అమ్మాయిని కూడా అలాగే చంపేసినట్లు నిందితుడు శ్రీనివాసరెడ్డి ఒప్పుకున్నాడు. అంతేకాదు.. 2015లో బంధువుల ఇంటికి వచ్చిన మరో చిన్నారిపైనా అఘాయిత్యానికి పాల్పడి హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. దీనిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. రెండు నెలలపాటు.. 22సార్లు 300 మంది సాక్షులను ఫాస్ట్‌ట్రాక్‌కోర్టు విచారించింది. గురువారం కూడా విచారణ చేపట్టిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి.. తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేశారు. త్వరలోనే ఈ కేసులో తుదితీర్పు వెలువడనుంది.
పడవ ప్రమాదం - రెండు రాష్ట్రాల్లో విషాదం :
గత సెప్టెంబర్ 15వ తేదీన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మంటూరు - కచ్చులూరు మధ్య రాయల వశిష్ట అనే ప్రైవేటు బోటు మునిగిపోయిన ప్రమాదంలో మొత్తం 51మంది మృతిచెందారు. వారిలో ఏపీకి చెందిన వాళ్లతో పాటు..పోలవరం విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ వాసులు కూడా ఉన్నారు. వరంగల్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండకు చెందిన 9మంది చనిపోయారు. గోదావరిలోనే అత్యంత లోతైన ప్రదేశంగా చెప్పే ఆ ప్రాంతంలో నది 300 అడుగులకుపైగా లోతు ఉందని గుర్తించారు. ప్రమాదం సమయంలో 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తున్నట్లు నిర్దారించారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో బోటు ప్రయాణానికి అనుమతి ఇవ్వడమే జలసమాధికి ప్రధాన కారణంగా తేల్చారు. ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదానికి బాధ్యులుగా ఇప్పటివరకు మొత్తం 19 మందిపై కేసులు నమోదు చేశారు. మొత్తానికి గుండెలను మెలిపెట్టే ఘోరాలు, హృదయాన్ని ద్రవింపజేసే ప్రమాదాలు 2019వ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలను వెంటాడాయి. పలువురికి గుండెకోతను మిగిల్చాయి. రాబోయే ట్వంటీ ట్వంటీ ఇయర్‌లో అయినా..ఇలాంటి దారుణాలకు ఫుల్‌స్టాప్ పడాలని కోరుకుందాం.