ముఖ్యాంశాలు

 • భాగ్యనగరంలో పెరుగుతున్న క్రైం రేట్..
 • జనవరిలో 18 హత్యలు..ఎప్పుడు ? ఎక్కడ ? ఎలా ?
 • చిన్న చిన్న గొడవలకే ప్రాణాలు తీస్తున్న యువత
 • ఎన్ని చట్టాలొచ్చినా బెదరని నేరస్థులు
 • నిర్మూలించలేక అయోమయ స్థితిలో ఉన్నతాధికారులు

హైదరాబాద్.. నిత్యం ఇక్కడికి బ్రతుకు తెరువు కోసం వచ్చే వారి సంఖ్య అధికం. ప్రొఫెషనల్ అయినా..కూలీ పని కోసమైనా..ఏ రాష్ర్టం నుంచి వచ్చినా ఇక్కడ బ్రతికేయచ్చు అన్నట్లుంటుందీ నగరం. టెక్నాలజీ పరంగా ఎంత ముందుకు వెళ్తుందో…పెరుగుతున్న రౌడీయిజం తో అంతే వేగంగా వెనక్కు వెళ్తోంది. ఒకప్పుడు రౌడీయిజానికి మారు పేరుగా ఉండేవి సీమ జిల్లాలు. ఇప్పుడు తెలంగాణలోని హైదరాబాద్ కూడా అలాగే తయారైంది.

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని, ప్రియురాలు మోసం చేసిందని, అదనపు కట్నం తీసుకురాలేదని, అభం శుభం తెలియని పసిపిల్లలపై మానభంగం చేసి హతమార్చడం…ఇలాంటి ఘటనలు నిత్యం ఏదొక మూల జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలతో హైదరాబాద్ క్రైం రేటు మళ్లీ పెరిగిపోతోంది. కొత్త సంవత్సరం..కొత్త నెల జనవరి లోనే ఏకంగా 18 హత్యలు జరిగాయంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ ఆయా పీఎస్ ల పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా గుర్తించినవి.

కానీ…ఇంకా ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాలు వెలుగులోకి రాకుండా ఉండిపోయినవి ఎన్ని ఉన్నాయో ఎవరికీ అంతుచిక్కవు. కొంతమంది విషయం బయటికి తెలిస్తే పరువు పోవచ్చన్న దృక్పథంతో ఆలోచించి కేసులు పెట్టకుండా..జరిగిన నష్టాన్ని పూడ్చేస్తారు. ఏ చిన్న విషయానికైనా ఇప్పుడు కత్తులు దూయడం ఫ్యాక్షన్ అయిపోయింది…కాదు కాదు..ఫ్యాషన్ అయింది. ఏదొక కారణం చెప్పి చంపాలనుకున్న వారిని నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి మూడో కంటికి తెలియకుండానే హత్యలు చేసేస్తున్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఏం లాభం చెప్పండి..

ఎప్పుడు ? ఎక్కడ ? ఎలా ?

 • జనవరి 15వ తేదీ రాత్రి ఒక మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది. మద్యం తాగుదామని చెప్పి మహిళ భర్తను ప్రియుడు తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో జరిగింది.
 • జనవరి 17వ తేదీన మద్యం సేవిస్తున్న ఇద్దరు ఆటో డ్రైవర్ ల మధ్య పాత విషయాలు ప్రస్తావనకొచ్చాయి. ఆ కోపంతో రగిలిపోయిన ఆటో డ్రైవర్ మరో డ్రైవర్ ను కత్తితో పొడిచి చంపిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.
 • గుర్తుతెలియని వ్యక్తులు కొందరు జనవరి 19వ తేదీ బాలాపూర్ పీఎస్ పరిధిలో ఒక యువకుడిని కాళ్లు చేతులు కట్టేసి, ఓ గోడౌన్ లో ఉరివేసి చంపేశారు.
 • జనవరి 19వ తేదీన మద్యానికి బానిసైన తండ్రి కన్నకూతురిని గొంతునులిమి హతమార్చాడు. భార్యను తాగేందుకు డబ్బులడుగగా ఆమె ఇవ్వలేదు. ఆ కోపంతో కూతుర్ని చంపేశాడు. ఈ ఘటన ఎల్ బీ నగర్ పీఎస్ పరిధిలోని కొత్తపేటలో చోటుచేసుకుంది.
 • జనవరి 23వ తేదీన కుల్సుంపురా పీఎస్ పరిధిలో డబ్బు విషయంలో వివాదం తలెత్తడంతో స్నేహితుడిని కత్తితో పొడిచి చంపేశాడో యువకుడు.
 • జనవరి 24వ తేదీన ప్రేమించిన యువతి తనతో పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఆమెను బిల్డింగ్ పైకి తీసుకెళ్లి హత్య చేశాడు. ఆ తర్వాత యువతిని బిల్డింగ్ పై నుంచి కిందికి తోసేశాడు. దీంతో తొలుత యువతిది ఆత్మహత్యగా భావించిన పోలీసులు…బిల్డింగ్ పై రక్తపు మరకలు ఉండటంతో సీసీ ఫుటేజ్ లను పరిశీలించగా..అసలు నిందితుడు దొరికాడు. ఈ ఘటన చిలకలగూడ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. తెలంగాణలో దిశ ఉదంతం తర్వాత సంచలనం సృష్టించిన హత్య ఇదే.
 • అదే రోజున ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే భార్యను హతమార్చాడు. కొద్దిరోజులు బాగానే కాపురం చేసిన అతను..నువ్వు తక్కువ కులానికి చెందిన దానివి అంటూ దూషిస్తూ వేధించిన భర్త..చివరికి గొంతునులిమి చంపేశాడు. రాచకొండ పీఎస్ పరిధిలోని చౌటుప్పల్ లో జరిగిందీ ఘటన.
 • జనవరి 26వ తేదీన ఫలక్ నుమా పీఎస్ పరిధిలో ఆటో డ్రైవర్ ను కొంతమంది వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. పాతకక్షలే ఆటో డ్రైవర్ హత్యకు దారితీశాయని పోలీసులు చెప్పుకొచ్చారు.
 • జనవరి 27వ తేదీన ఒక యువకుడు తన సవతి తల్లిని చంపేశాడు. ఈ ఘటన నేరేడ్ మెట్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. తండ్రి రిటైర్మెంట్ పెన్షన్ ఎక్కడ తమకు రాకుండా చేస్తుందన్న కోపంతోనే హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
 • జనవరి 28న ఒక సెల్ఫోన్ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తడంతో యువకుడు స్నేహితుడిపై కత్తితో దాడిచేసి పొడిచాడు. ఈ కేసులో బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

ఒకే రోజు రెండు హత్యలు

 • జనవరి 21న ఇద్దరు స్నేహితుల మధ్య నగదు విషయంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ ఒక యువకుడి హత్యకు దారితీసింది. డబ్బుల విషయంలో రాజీ కుదరక స్నేహితుడిని హత్య చేశాడు యువకుడు. ఈ ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగింది. అదే రోజు కూకట్ పల్లి పీఎస్ పరిధిలో స్నేహితుడు అరేయ్ అని పిలిచినందుకు మద్యం మత్తులో ఉన్న యువకుడు బీరు సీసాతో పొడిచి చంపేశాడు.
 • జనవరి 29వ తేదీన భార్య తాను చెప్పిన మాటల వినడం లేదన్నకోపంతో కక్ష పెంచుకున్నాడు భర్త. అదను చూసి ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన లంగర్ హౌజ్ పరిధిలో జరిగింది. అదేరోజున రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కందుకూరులో పక్కింట్లో ఉండే వృద్ధురాలిని యువకుడు హతమార్చాడు. జల్సాలు, వ్యసనాలకు అలవాటుపడిన అతను నగల కోసం వృద్ధురాలిని చంపినట్లు తెలుస్తోంది.

హత్యా యత్నాలు

 • జనవరి 10వ తేదీన మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో స్నేహితుడు మరో స్నేహితునిపై బ్లేడుతో దాడిచేసి గాయపరిచాడు. ఈ ఘటన కుషాయిగూఢ పరిధిలో చోటుచేసుకుంది.
 • జనవరి 13వ తేదీన తన భార్యతో వివాహేతర సంబంధం పె ట్టుకున్నాడనే అనుమానంతో భర్త ఒక వ్యక్తితో మద్యం తాగించి కత్తితో దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ లో వెలుగు చూసింది.
 • అలాగే జనవరి 18వ తేదీన బేగంపేట పీఎస్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న మహిళపై మద్యం మత్తులో ఉన్న వ్యక్తి బ్లేడుతో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. నిజానికి ఆమెను చంపాల్సిన అవసరం అతనికి లేదు. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
 • కత్తిని దగ్గర పెట్టుకుని ఆస్పత్రి లోకి వెళ్లిన యువకుడిని మొఘల్ పురా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జనవరి 21న జరిగింది.

ఇంత జరుగుతున్నా ఏ ఒక్క పోలీస్ కూడా నగరంలో గుండాగిరిని రూపుమాపలేకపోతున్నారు. హత్యలు జరిగితే..ఆ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించి వారిని మేపుతున్నారే గానీ..కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు. చేసిన నేరం ఎంత పెద్దదైనా మన పోలీసుల తీరు ఇదే. అయితే నేరస్తులు ఎన్ని దారుణాలు చేసినా వారిని చూస్తూ ఉండటం తప్ప తామేమీ చేయలేని పరిస్థితి అని కొందరు అధికారులు బహిర్గతంగా వెల్లడించడం గమనార్హం. అరెస్ట్ అయి జైలుకెళ్లిన నిందితులు ఎలాగొలా బెయిల్ సంపాదించి తమపై కేసు పెట్టిన వారిపై కక్ష పెంచుకుని మరీ హత్యలు చేస్తుండటం విస్తుగొలుపే విషయం.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.