వైద్య సదుపాయాలకు రూ.15వేల కోట్లు, విద్యార్థుల కోసం స్వయంప్రభ ఛానళ్లు

By Newsmeter.Network  Published on  17 May 2020 2:14 PM IST
వైద్య సదుపాయాలకు రూ.15వేల కోట్లు, విద్యార్థుల కోసం స్వయంప్రభ ఛానళ్లు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో చివరి విడతగా మరికొన్ని వివరాలను ఆదివారం ప్రకటించారు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన కేటాయింపులను వివరించారు. టెస్టింగ్‌, ల్యాబ్స్‌, కిట్లు, ఇతర అత్యవసర పరికరాల కోసం రూ. 15వేల కోట్లు ఇప్పటికే ప్రకటించినట్లు తెలిపారు. రాష్ట్రాలకు రూ. 4113 కోట్లకుపైగా నిధులు విడుదల చేశామని అన్నారు. ఆరోగ్యంపై ప్రభుత్వం చేసే ఖర్చు పెంచుతామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అదేవిధంగా టెస్టు కిట్లు తదితర అవసరమైన వస్తువుల కోసం రూ. 3,750 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. టెస్టింగ్‌ ల్యాబ్‌లు, కిట్స్‌ల కోసం మరో రూ. 550 కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్‌ వివరించారు. ఆరోగ్య రంగంలో పనిచేసే సిబ్బందికి రూ. 50లక్షల చొప్పున బీమా కల్పించామని అన్నారు.

Also Read :క్రిమినాశకాల పిచికారీతో కరోనా అంతంకాదు

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఆరోగ్యరంగంలో పెట్టుబడులు పెంచుతామని తెలిపారు. ప్రతి జిల్లాలో సాంక్రమిక వ్యాధుల ఆసుపత్రుల ఏర్పాటు, దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత ప్రజారోగ్య పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేస్తామని అన్నారు. నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రారంభిస్తామని నిర్మలాసీతారామన్‌ తెలిపారు. ఇదిలాఉంటే కోవిడ్‌19 మహమ్మారి వల్ల విద్యార్థుల చదువులు దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. మే 30 నాటికి దేశంలో టాప్‌ 100 యూనివర్శిటీలలో ఆన్‌లైన్‌ కోర్సులు ప్రారంభిస్తామని తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో 12 స్వయంప్రభ డీటీహెచ్‌ ఛానళ్లన ఏర్పాటు చేస్తామని సీతారామన్‌ వెల్లడించారు. ఇప్పటికే మూడు ఛానళ్లు స్కూల్‌ విద్యార్థులకు కేటాయించామని, ఇప్పుడు మరో 12 ఛానళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 'పీఏ ఈ - విద్య' పేరుతో డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ కార్యక్రమం వెంటనే ప్రారంభిస్తామని అన్నారు. ఈ - పాఠశాల వెబ్‌సైట్‌లో సుమారు 200 కొత్త పుస్తకాలను జోడించినట్లు సీతారామన్‌ తెలిపారు.

Also Read :రూ. 12వేలలోనే పెండ్లి తంతుపూర్తి

Next Story