విమానం సీట్ల కింద 14 కిలోల బంగారం పట్టివేత
By సుభాష్ Published on 12 Dec 2019 7:54 PM ISTమరోసారి శంషాబాద్ విమానాశ్రయంలో భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అధికారుల కళ్లు గప్పి భారీ మొత్తంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. అక్రమ బంగారం తరలింపునకు అడ్డుకట్ట పడటం లేదు. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల దగ్గర 14 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలీజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఎరిండియా విమానం ఏఐ952లో సీట్ల కింద ఉంచి 14 కిలోల బంగారాన్ని రవాణా చేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న అధికారులు, సౌత్ కొరియా, చైనాకు చెందిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు... విమానంలోని 31ఏ, 32ఏ సీట్ల కింద 112 బంగారం బిస్కెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ బంగారం విలువ దాదాపు రూ. 6 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో విమాన సిబ్బంది పాత్రపై కూడా ఉన్నట్లు డీఆర్ఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో విమాన సిబ్బందిని కూడా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్ననిందితులను కూడా విచారిస్తున్నారు.