గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ టెంపో వాహనం, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది మృతి చెందారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన వడోదర జిల్లాలోని పాద్రా తాలుకాలోని మహువాద్‌ గ్రామంలో జరిగింది. ప్రమాద స్థలిలో ఏడుగురు చనిపోగా.. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తమ ప్రాణాలను విడిచారు. మరో నలుగురు క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం అతివేగమేనని స్థానికులు అంటున్నారు.

సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సుధీర్ దేశాయ్ తెలిపారు. మరో వైపు రేపు గుజరాత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటించనున్నారు. ఇలాంటి సమయంలో ప్రమాదకర ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని గుజరాత్‌ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి ప్రమాదాలు, టెన్షన్లు లేకుండా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్హార్‌ ప్రాంతంలో ఓ టాటా సుమో అతి వేగంగా నడపడంతో అదుపు తప్పి 300 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

అంజి గోనె

Next Story