ఒకే గోత్రపు వ్యక్తిని పెళ్లాడిందని ప్రాణం తీశారు

By అంజి  Published on  23 Feb 2020 2:52 AM GMT
ఒకే గోత్రపు వ్యక్తిని పెళ్లాడిందని ప్రాణం తీశారు

ఒక వ్యక్తి కులం, గోత్రం, ఆస్తి, ఆదాయం చూడకుండా మనసులు కలిసినపుడే అది ప్రేమ. అలాంటి ప్రేమను పొందినవారు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. కానీ చాలా మంది పెద్దలకు ప్రేమ తప్ప ఇతర అన్ని విషయాలు చూసి పెళ్లి చేద్దామనుకుంటారు. కాదంటే బెదిరింపులకు దిగుతారు. కానీ కొందరు మాత్రం తమ మాట కాదన్నందుకు సొంత పిల్లల ప్రాణాలే తీస్తారు.

ఇప్పటి వరకు ప్రేమ వివాహం చేసుకున్నందుకు తల్లిదండ్రులు చేసిన పరువు హత్యలు చూశాం. కులం, మతం, ఆస్తి, అంతస్తు కారణాలతోనూ ప్రాణాలు తీసిన ఉదంతాలు విన్నాం. కానీ, ఒకే గోత్రం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు తల్లిదండ్రుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయిందో యువతి.

తూర్పు ఢిల్లీలో పాల వ్యాపారం చేసే రెండు కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉండేవి. ఆ రెండు కుటుంబాలకు చెందిన శీతల్‌ చౌదరి, అంకిత్‌ అనే యువతీ యువకులు 2016 నుంచి ప్రేమించుకున్నారు. మూడేళ్ల పాటు రహస్యంగా సహజీవనం చేశారు. 2019 అక్టోబర్‌లో ఇంట్లో వారికి తెలియకుండా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్లిద్దరూ వారివారి కుటుంబాలతోనే వేర్వేరుగా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 20న తన పెళ్లి విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఇంట్లో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా 10 రోజుల తర్వాత నుంచి యువతి కనపడకుండా పోయింది. కొన్ని రోజుల నుంచి భార్య కనిపించకపోవంతో ఫిబ్రవరి 18న అంకిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అత్తమామలపై అనుమానం వ్యక్తం చేశాడు. అయితే అప్పటికే జనవరి 30న ఉత్తరప్రదేశ్ పోలీసులు అలీగఢ్ కాలువలో గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని గుర్తించారు. ఇదే సమయంలో అంకిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Delhi woman killed by family

అత్తామామలపై కూడా అంకిత్ అనుమానం వ్యక్తం చేయడంతో సందేహించిన పోలీసులు ఫిబ్రవరి 21న ఉత్తరప్రదేశ్‌కు ఓ బృందాన్ని పంపించగా, మృతదేహం శీతల్‌దేనని నిర్ధారణ అయింది. దీంతో నేరానికి పాల్పడ్డ వారితో పాటు అందుకు సహకరించిన వారందరినీ దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి తల్లిదండ్రులు రవీందర్ చౌదరి, సుమన్, మామయ్య సంజయ్, బంధువులు ఓమ్ ప్రకాశ్, అంకిత్, పర్వేశ్‌లను అరెస్టు చేశారు. అనంతరం వారిని తమదైన శైలిలో పోలీసులు విచారించగా, ఒకే తండ్రి పిల్లలు ఎలాగైతే అన్నా చెల్లెళ్లు అవుతారో అలాగే ఒకే గోత్రానికి చెందిన వారు అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు అవుతారని, అలాంటి వరుస ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకే హతమార్చినట్లు ఆ తల్లిదండ్రులు ఒప్పుకొన్నారు. ఈ ఏడాది జనవరి 29న శీతల్ ని గొంతు కోసి చంపామని, ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు కారులో తూర్పు ఢిల్లీ నుంచి దాదాపు 80 కిలో మీటర్లకు పైగా ప్రయాణించి ఉత్తర్‌ప్రదేశ్‌లోని సికింద్రాబాద్‌కు చేరుకుని కాలువలో మృతదేహాన్ని విసిరేసామని అంగీకరించారు.

Next Story
Share it