టెన్త్ పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేస్తారా..? స్పందించిన మంత్రి
By సుభాష్
దేశంలో కరోనా కలకలం సృష్టంచడంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ ఇతర వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి. కరోనా మహమ్మారి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అయితే ఈ మధ్య ఓ వార్త వైరల్ అవుతోంది. ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగవని, పైగా టెన్త్ విద్యార్థులను పాస్ చేస్తారని వస్తున్న వార్తలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. పరీక్షలు తప్పకుండా నిర్వహించి తీరుతామని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ఎఫెక్ట్‌తో పదో తరగతి పరీక్షలు జరగవని వస్తున్న వార్తలను నమ్మవద్దని అన్నారు. లాక్‌డౌన్ అమలు పూర్తయ్యాక పరీక్షల షెడ్యూల్ ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే రాబోయే రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఇటీవల సర్కార్ ప్రకటించింది. అలాగే కరోనా విలయతాండవం చేస్తుండటంతో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షలు రాయకుండానే విద్యార్థులందరినీ పై తరగతికి ప్రమోట్ చేస్తున్నట్లు పేర్కొంది.