బిగ్‌ బ్రేకింగ్‌ : ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2020 12:01 PM GMT
బిగ్‌ బ్రేకింగ్‌ : ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు..

ఏపీలో పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థులందరని పాస్‌ చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించాలని ప్రణాళిక చేశామని, పేపర్ల సంఖ్య ను 11 నుంచి 6కు తగ్గించామని, ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పించామన్నారు. పరీక్షల కోసం అందరినీ సమన్వయం చేశామని, భౌతిక దూరం కోసం పరీక్షా కేంద్రాలను సైతం పెంచామన్నారు.

అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు రద్దు చేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. దీంతో పాటుగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్, సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్, సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు కావడంతో, ఇటీవలే ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా పాస్ అయినట్టే అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కోసం విద్యార్థులు ఫీజు కట్టి ఉంటె, ఆ ఫీజును విద్యార్థులకు తిరిగి వాపస్ చేస్తామని విద్యాశాఖామంత్రి తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు. పదోతరగతి విద్యార్థులకు గ్రేడింగ్ ఇస్తామని, త్వరలోనే గ్రేడింగ్ విధివిధానాలు ప్రకటిస్తామని తెలిపారు.

ఇప్పటికే రాష్ట్రంలో రెండు సార్లు పదోతరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను రద్దు చేశాయి.

Next Story
Share it