రెండు వారాల్లోనే భారత్‌లో అతి పెద్ద ఆస్పత్రి రెడీ
By సుభాష్ Published on 26 March 2020 5:49 PM IST
కరోనా మహమ్మారి ప్రపంచాన్నిపట్టిపీడిస్తోంది. వేలాదిగా మృతి చెందగా, లక్షలాది మంది చికిత్స పొందుతున్నారు. ఇక భారత్‌లో ఇప్పటికే 600లకుపైగా కరోనా కేసులు నమోదు కాగా, 14 మంది వరకు మృతి చెందారు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక కరోనా బాధితుల కోసం దేశంలో అతిపెద్ద ఆస్పత్రిని నిర్మించేందుకు ఓడిషా ప్రభుత్వం సిద్ధమైంది. వెయ్యి పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రి రెడీ అవుతోంది. రెండు వారాల్లోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ భారీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా కరోనా రోగుల కోసం మాత్రమే చికిత్స అందించనున్నారు. దీనికి సంబంధించి ఒప్పందంపై ఒడిషా ప్రభుత్వం, కార్పొరేట్లు, మెడికల్ కాలేజీలు గురువారం సంతకాలు కూడా చేశాయి. దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులను తట్టుకునేందుకు ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. కాగా, ఒడిషాలో ఇప్పటి వరకూ రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఒడిషాలో 82వేల మంది సెల్ఫ్ క్యారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. వీరంతా భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి, అలాగే ఇటీవల కాలంలో విదేశాల నుంచి ఒడిషాకు వచ్చిన వారున్నారు.