ఇకపై స్కూళ్లు 100 రోజులే..!

By సుభాష్  Published on  30 May 2020 1:49 PM IST
ఇకపై స్కూళ్లు 100 రోజులే..!

దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ మే 31తో ముగియనుంది. దీంతో కరోనా ఉధృతి తీవ్రంగా ఉండటంతో మరో రెండు వారాలు పొడిగించే అవకాశాలున్నాయి. ఇక విద్యాసంస్థలన్నీ కూడా మూసే ఉన్నాయి. సాధారణంగా జూన్‌ 12తో పాఠశాలల సెలవులు ముగిసి పునః ప్రారంభం అయ్యే సమయం దగ్గరపడుతుండటంతో అసలు విద్యాసంస్థలు తెరుచుకుంటాయా.. ? లేదా? అనే ఆందోళనలో ఉన్నారు విద్యార్థులు, తల్లిదండ్రులున్నారు.

ముఖ్యంగా కరోనా వైరస్‌ వృద్ధులు, పిల్లలపై అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుండటంతో కరోనా కట్టడి కోసం కేంద్రం మరింత చర్యలు చేపడుతోంది. ఇక నూతన విద్యాసంవత్సరంలో అనేక మార్పులు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఇందులో భాగంగానే సరికొత్త ప్రణాళికలు రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

గతంలో మాదిరిగానే పిల్లలు బడులకు 220 రోజులు వెళ్లకపోవచ్చని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక మీదట పిల్లలు పాఠశాలలకు 100 రోజులు వెళ్లే అవకాశాలుంటాయని, మరో 100 రోజులు ఇంటి నుంచి ఆన్‌లైన్‌ ద్వారా విద్యను అభ్యసించే విధంగా కేంద్రం ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరో 20 రోజుల్లో విద్యార్థులలో మానసిక వికాసాన్ని పెంచేలా వైద్యులు, కౌన్సిలర్స్‌తో కార్యక్రమాలు చేపట్టేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆన్‌లైన్‌ సౌకర్యం లేని విద్యార్థులపై పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి సారించాలని హెచ్‌ఆర్డీ మంత్రిత్వశాఖ సూచించింది.

Next Story