ముఖ్యాంశాలు

  • శివసేనకు షాక్ ఇచ్చిన శరద్ పవార్
  • ఎవరి రాజకీయాలు వారివేనన్న శరద్ పవార్
  • డిఫెన్స్ లో పడ్డ శివసేన అధినేత ఉద్దవ్ థాకర్

శరద్ పవార్‌ మనసులో ఏదో..?!!. మహారాష్ట్ర రాజకీయం మహారంజుగా ఉంది.నిన్నటి దాకా అంతా ఓకే అనుకున్న శివసేనకు ఎన్సీపీ షాక్ ఇచ్చింది. శివసేనకు సీఎం, కాంగ్రెస్‌కు స్పీకర్‌, ఎన్సీపీకి కనీస ఉమ్మడి ప్రణాళిక చైర్మన్ అని వార్తలు బయటకు వచ్చాయి. ఇక..శివసేన – కాంగ్రెస్‌ – ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పడటమే లేట్ అనుకున్నారు. శివసేన సీఎం పీటంపై ఐదేళ్లు కాదు ఇరవై ఐదేళ్లు ఉంటుందని సంజయ్ రౌత్ మీడియా ముందు ప్రకటనలు కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా రాజకీయ కురువృద్ధుడు, మరాఠా యోధుడి ప్రకటన ముందు ఆవిరి అయ్యాయి.

ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్రితో సమావేశానికి ముందు శరద్ పవార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీంట్లో శరద్ పవార్ చేసిన కామెంట్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. శివసేన – కాంగ్రెస్‌ – ఎన్సీపీ ప్రభుత్వం సాధ్యమేనా అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దీనికి శరద్ పవార్‌ సమాధానం ఇస్తూ..శివసేన – బీజేపీ కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ – ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి. ఎవరి రాజకీయాలు వారు చేస్తారంటూ శరద్ పవార్‌ సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడున్నవారు ఆశ్చర్యంలో మునిగిపోయారు.

శరద్ పవార్‌ వ్యాఖ్యలతో పురుడు పోసుకోకముందే..శివసేన – కాంగ్రెస్‌ – ఎన్సీపీ కూటమిపై సందేహాలు మొదలయ్యాయి. పవార్‌ వ్యాఖ్యలతో శివసేనకు పవర్‌ దూరమయ్యే అవకాశం ఏర్పడింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి సీఎం పీఠంపై పీఠముడి కొనసాగుతూనే ఉంది. సీఎం పీఠం చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలని శివసేన మొండికేయడంతో అసలు డ్రామా మొదలైంది. సీఎం పీఠం పంచుకోవడానికి బీజేపీ ససేమిరా అంటోంది. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటామని కూడా ప్రకటించింది. శివసేన మాత్రం సంకీర్ణ ధర్మానికి, సిద్దాంతాలకు తిలోదకాలు ఇచ్చి..కాంగ్రెస్, ఎన్సీపీతో జత కట్టడానికి వెనకాడలేదు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి బీజేపీ గుంభనంగానే ఉంటుంది. తమ సీఎం అభ్యర్ధి ఫడ్నవీస్ అని చెప్పి ..రెండో మాట లేకుండా ఉంది. శివసేన మాత్రం అధికారం కోసం రాజకీయ గంతులు వేయడం మొదలు పెట్టింది. ప్రజలు ఏమనుకుంటారు అని కూడా ఆలోచించకుండా సీఎం పీఠమే పరమావధిగా పావులు కదిపింది. ఈ లోపు అసెంబ్లీ గడువు కూడా ముగియడంతో గవర్నర్ ప్రెసిడెంట్ రూల్ కు పెట్టించారు. ఇది శివసేన చేసుకున్న స్వయంకృతాపరాధమే. 105 సీట్లు వచ్చిన బీజేపీ 56 సీట్లు వచ్చిన శివసేనతో సీఎం సీటు పంచుకోమంటే పంచుకుంటుందా..?. మిత్రుడు బలమెరిగి నడుచుకోవాల్సిన శివసేన ..సమయం చూస్కోకుండా గర్జించడంతోనే ఈ సమస్య.

ఉద్దవ్ స్థానంలో సీనియర్ థాకర్ ఉన్నట్లైతే …కాంగ్రెస్, ఎన్సీపీ వంక చూసే వారు కూడా కాదు. బాల్ థాకర్ జీవించినంత కాలం సిద్ధాంతాలే ఊపిరిగా బతికాడు. బీజేపీతో తన దోస్తీని చరమాంకం దాకా కొనసాగించాడు. తమ స్నేహానికి రాజకీయ సిద్ధాంతమే పునాది అని ఆయన పలుమార్లు చెప్పారు.ఇప్పటికైనా..వాస్తవాలు గ్రహించి ముందుకు పోవాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.