యువరాజ్ ప్రశ్నకు బుమ్రా సమాధానం అదుర్స్
By తోట వంశీ కుమార్ Published on 28 April 2020 9:21 PM ISTకరోనా దెబ్బతో క్రీడా రంగం కుదేలైంది. లాక్‌డౌన్ కారణంగా క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఎప్పుడూ బీజీ షెడ్యూల్‌తో ఉండే భారత క్రికెట్లర్లు కరోనా సెలవులను కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. అభిమానులతో ముచ్చటిస్తున్నారు.
తాజాగా భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, పేసర్ జస్ ప్రీత్ బుమ్రా లు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువరాజ్ అడిగిన ఓ ప్రశ్నకు అదిరిపోయే జవాబు ఇచ్చాడు పేస్ గుర్రం బుమ్రా. ఈ ఇద్దరిలో ఎవరు అత్యుత్తమ పినిషర్ ఎవరో చెప్పాలని యువరాజ్.. బుమ్రాను కోరాడు. అందులో ఒకటి తన పేరు కాగా.. రెండో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని. ఈ ప్రశ్నకు బుమ్రా చాలా తెలివిగా చెప్పాడు. వీరిద్దరిని పోల్చడం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరినే ఎంచుకోవాలని అన్నట్లుగా ఉంటుందని సమాధానం చెప్పాడు.
ఇక బుమ్రా బౌలింగ్ శైలి విభిన్నంగా ఉంటుందనే విషయం తెలిసిందే. దీనిపై బుమ్రా మాట్లాడుతూ.. తన విలక్షణమైన బౌలింగ్ శైలి కారణంగా ఎక్కువ కాలం క్రికెట్‌లో కొనసాగవని చాలా మంది తన కెరీర్ ప్రారంభంలో అనేవారని గుర్తుచేసుకున్నాడు. రెండు మూడు రంజీలకు మించి ఆడలేవని, భారత్ జట్టులో చోటు అనేది చాలా అత్యాశే అవుతుందని తనను ఎగతాళి చేసేవారని అన్నాడు. దీనిపై యువరాజ్ మాట్లాడుతూ.. బుమ్రా అత్యుత్తమ ఆటగాడన్నారు. మూడు ఫార్మాట్లతో (టెస్టులు, వన్డేలు, టీ20)ల్లో నెంబర్ బౌలర్ అయ్యే సామర్థ్యం ఉందన్నాడు. బుమ్రా ఇది సాధించడానికి ఎక్కువ సమయం పట్టదని.. కేవలం రెండేళ్లలోనే ఈ ఘనత సాధిస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.
బౌలింగ్‌లో ప్రత్యర్థిని వణికించే బుమ్రా బ్యాటింగ్‌లో మాత్రం ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఒక్క మ్యాచ్ లో కూడా 10 పరుగులు సాధించలేకపోయాడు. టెస్టుల్లో 2.9, వన్డేల్లో 3.8, టీ20ల్లో 4 బుమ్రా బ్యాటింగ్ సగటు. దీనిపై యువరాజ్ సరదాగా కామెంట్ చేశాడు. బమ్రా ట్విట్టర్ లో ఓ వీడియో పోస్టు చేసి యువీకి సరదాగా సమాధానం ఇచ్చాడు. చాలా మంది కోరిక మేరకు, ముఖ్యంగా యూవీ కోసం ఈ వీడియో అంటూ.. 2017లో గుజరాత్, గోవా మధ్య జరిగిన మ్యాచ్‌లో తన బ్యాటింగ్ వీడియోను పోస్ట్ చేశాడు. గుజరాత్ తరపున బ్యాటింగ్‌కు దిగిన బుమ్రా 24 బంతుల్లో 42 పరుగులు చేసి గెలపులో కీలక పాత్ర పోషించాడు. భారీ షాట్‌లతో గోవా బౌలర్‌కు చుక్కులు చూపించాడు.