పడిలేచిన కెరటం తను.. నిలిచి గెలిచిన వ్యక్తిత్వం తను..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Dec 2019 8:58 PM IST'నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే.. నిబిడాశ్చర్యంతో వీరు.. నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే.. నిర్దాక్షిణ్యంగా వీరే' ఇంతటి పదునైన మాటలు మహాకవి శ్రీశ్రీ ఎవరి కోసం, ఎవరినుద్దేశించి అన్నారో కానీ.. ఈ మాటలు కచ్చితంగా ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు మాత్రం వర్తిస్తాయి. తన అసాధారణ ఆటతీరుతో టీమిండియాకు ఒంటి చేత్తో ఎన్నో విజయాలు అందించి అభిమానుల గుండెల్లో నిలిచిన యువరాజ్.. ఫామ్ కోల్పోయి అదే అభిమానుల నుండి అన్నే విమర్శలూ ఎదుర్కొన్నాడు. ఎంత కష్టంలోనూ గుండె నిబ్బరం కోల్పోకుండా నిలిచి చాలామంది యువతకు రోల్ మోడల్ అయ్యాడు. అటువంటి యువరాజ్ నేడు 38వ వడిలోకి అడుగిడుతున్నాడు. అతని గురించి కొన్ని విషయాలు..
19 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి కెరీర్ తొలినాళ్లలోనే మంచి ఫినిషర్‌గా, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా, ఆల్‌రౌండర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువరాజ్.. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు(వరల్డ్ టీ20, వన్డే వరల్డ్ కప్) అందించడంలో కీలకపాత్ర పోషించాడు.
యువీ పేరు ప్రస్తావించగానే క్రీడాభిమానులకు టక్కున గుర్తుకువచ్చేది ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదడం. యావత్తు క్రీడా ప్రపంచానికి యువీని దగ్గర చేసిన ఆ ఫీట్‌ను టీ20 వరల్డ్ కప్‌లో సాధించాడు. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. కేవలం 12 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు.
అనంతరం సొంతగడ్డపై 2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో కూడా యువీ తన అద్భుతమైన ఫామ్‌ని కొనసాగించాడు. ఈ ప్రపంచకప్‌లో 362 పరుగులు(1x100, 4x50)తో చెలరేగి 'మ్యాన్ ఆఫ్ ద టోర్నీ'ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు ఈ టోర్నీలో 15 వికెట్లు కూడా పడగొట్టాడు. అలా రెండు ప్రపంచకప్ విజయాలలో సభ్యునిగా ఉన్న యువీ.. అంతకుముందు 2000 సంవత్సరంలో ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ విజేతగా నిలవడంలోనూ కీలకపాత్ర పోషించాడు. అలా ఐసీసీ నిర్వహించే మూడు వరల్డ్ కప్‌ల్లో సభ్యుడిగా ఉన్న ఏకైక భారత ఆటగాడిగా యువరాజ్ సింగ్ నిలిచాడు.
ఇలా భారత క్రికెట్ జట్టు సాధించిన ఎన్నో చిరస్మరణీయ విజయాలలో కీలకపాత్ర పోషించిన యువరాజ్.. 2011 సంవత్సరం ఏప్రిల్ మాసంలో భయంకర క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డాడు. కీమోథెరపీ చికిత్స ద్వారా యువీ క్యాన్సర్‌ను జయించాడు. క్యాన్సర్‌ను జయించిన అనంతరం.. క్యాన్సర్ బాధితులకు అండగా నిలవాలని ‘యువీకెన్' పేరుతో ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తున్నాడు.
ఈ డాషింగ్ బ్యాట్స్‌మెన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.