హిట్‌మ్యాన్ పై యువీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ఆ పాక్ బ్యాట్స్‌మెన్ గుర్తుకువ‌స్తాడంటూ..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2020 10:01 PM IST
హిట్‌మ్యాన్ పై యువీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ఆ పాక్ బ్యాట్స్‌మెన్ గుర్తుకువ‌స్తాడంటూ..

హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ పై మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆదివారం యూ ట్యూబ్ చాట్ షోలో యువీ పాల్గొన్నాడు. అలాగే రోహిత్‌ను చూడగానే ఏమనిపించిందనే ప్రశ్నకు.. త్వరగా అవకాశం లభించిందనే భావన కలిగిందన్నాడు.

‘తొలి సారి భారత జట్టుకు ఎంపికైన రోహిత్‌ శర్మను చూశాక అతడికి ఇంకా సమయం ఉందని భావించాను. అతడి కెరీర్‌ తొలి నాళ్లలో నాకు పాకిస్తాన్‌ మాజీ సారథి ఇంజమాముల్‌ హక్‌ను గుర్తుకు తెచ్చాడు. ఎందుకంటే వీరిద్దరి మధ్య ఓ కామన్‌ పాయింట్‌ ఉంది. బ్యాటింగ్‌ కోసం క్రీజులోకి దిగాక స్ట్రైక్‌ తీసుకోవడం కోసం కొంత సమయం తీసుకుంటారు. బౌలర్లకు కాస్త సమయమిచ్చాకే వారు బ్యాటింగ్‌ చేయడం(పరుగులు రాబట్టడం) మొదలు పెడతారు’అంటూ యువ‌రాజ్‌ తెలిపాడు.

హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడ‌ని అయితే.. దుర‌దృష్ట వ‌శాత్తు అత‌నికి బ్యాటింగ్ రాలేద‌ని గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఆరు సిక్స‌ర్లు బాదాడు. కెరీర్ ఆరంభంలో మిడిల్ ఆర్డ‌ర్‌లో ఆడిన రోహిత్.. ఓపెన‌ర్‌గా ప్ర‌మోష‌న్ పొందాక అద్వితీయ ఆట‌తీరుతో అంద‌రిని అల‌రించాడు. పరిస్థితులకు తగ్గుట్టు ఎప్పటికప్పుడు తన టెక్నిక్‌ మార్చుకుంటూ అసాధరణ ఆటగాడిగా ఎదిగాడు.

Next Story