ముంబై పేలుళ్ల నిందితుడు యూసుఫ్ మెమన్ మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2020 12:40 PM GMT
ముంబై పేలుళ్ల నిందితుడు యూసుఫ్ మెమన్ మృతి

1993 సంవత్సరం మార్చి 12న ముంబయిలో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో దాదాపు 250 మంది మృతి చెందగా.. వేల మంది గాయపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు యూసుఫ్‌ మెమన్‌(54) శుక్రవారం మృతి చెందాడు. నాసిక్‌ రోడ్డు జైలులో ఈ రోజు ఉదయం 10గంటల సమయంలో యూసుఫ్ స్పృహ తప్పి పడిపోయాడని, వెంటనే ఆస్పత్రికి తరలించామని.. అక్కడ చికిత్స పొందుతూ యూసుఫ్‌ మరణించారని అధికారులు వెల్లడించారు. అయితే అతని మృతికి గల కారణాలు తెలియరాలేదు.

ముంబై పేలుళ్ల కేసులో పరారిలో ఉన్న ముఖ్య నిందితుడు టైగర్‌ మెమన్‌కు యూసుఫ్‌ సోదరుడు. పేలుళ్ల కేసులో యూసుఫ్‌ దోషిగా తేలడంతో.. కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఇక ఇదే కేసులో నిందితుడైన టైగర్ మరో సోదరుడు యూకుబ్ మెమన్‌ను 2015లో ఉరి తీసిన విషయం తెలిసిందే.

Next Story