మండలి రద్దుకు ప్రభుత్వం సన్నాహాలు..
By రాణి
ముఖ్యాంశాలు
- మండలి రద్దు అంత సులభం కాదు
- పార్లమెంట్ నిర్ణయంతోనే మండలి రద్దు
- కనీసం సంవత్సరమైనా పడుతుందన్న యనమల
ఏపీ శాసన మండలిని రద్దు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రూల్ 71 ప్రకారం వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరపాల్సిందేనని మంత్రి బుగ్గన మండలిలో ప్రస్తావించగా టీడీపీ ఎమ్మెల్సీలు అందుకు సహకరించలేదు. దీనికి తోడు యనమల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. శాసన మండలి రద్దుపై కూడా ఆయన స్పందించారు. మండలి రద్దు అంత సులభం కాదన్నారు. పార్లమెంట్ నిర్ణయంతోనే మండలి రద్దు సాధ్యమవుతుందని, ఇందుకు కనీసం ఏడాది సమయం పడుతుందని యనమల పేర్కొన్నారు. మండలి రద్దు యోచన అప్రజాస్వామికమని ఎమ్మెల్సీ నారా లోకేష్ ధ్వజమెత్తారు. రూల్ 71పై ఎన్ని రోజులు చర్చ జరిపేందుకైనా తాము సిద్ధమన్నారు.
మరోవైపు ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ నిధులు మళ్లించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికార పక్షాన్ని ప్రశ్నిస్తుండగానే ఎమ్మెల్యే రోజా ఆయా నిధులపై ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రతిపక్షం అడ్డుపడుతోందంటూ విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ ప్రకారం కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేసినప్పటికీ..దానిని పట్టించుకోకపోవడంతో సభ నుంచి టీడీపీ వాకౌట్ చేసింది. అనంతరం టీడీపీ అసెంబ్లీ లాబీలో వారంతా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
మంగళవారం అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే..స్పీకర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. స్పీకర్ తమ్మినేని పోడియం చుట్టూ టీడీపీ సభ్యులు చేరి నినాదాలు చేస్తుండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో విసిగిపోయిన స్పీకర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. లంచ్ అవర్ తర్వాత తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.