రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం వైసీపీ వినాశనానికి పునాది

By రాణి  Published on  21 Jan 2020 6:20 AM GMT
రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం వైసీపీ వినాశనానికి పునాది

ముఖ్యాంశాలు

  • వికేంద్రీకరణను మహిళలు, యువతే అడ్డుకోవాలి : పవన్
  • తరలింపు తాత్కాలికమే... ‘అమరావతి’ శాశ్వత రాజధాని
  • అప్పుడు తెలుగుదేశం... ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
  • రెండు పార్టీలను బలంగా ఎదుర్కొంటాం
  • రాజధాని రైతుల ఆందోళనలకు జనసేన, బీజేపీ భరోసా

రాజధాని వికేంద్రీకరణపై సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వైఎస్సార్సీపీ వినాశనానికి పునాది అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 5 కోట్ల ఆంధ్రుల ఆమోదంతో ఏర్పడిన రాజధాని అమరావతి అని .. దానిని ఇక్కడ నుంచి కదిలించడం అసాధ్యమన్నారు. కాదు కూడదని కదిలించినా అది తాత్కాలికమేనని, ఈ విషయాన్ని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం ఇదేనని ఆయన వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని, అది ఎక్కడికీ పోదని బీజేపీ అగ్రనాయకత్వం భరోసా ఇచ్చిందని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు నిర్మించడానికి జనసేన వ్యతిరేకం కాదు కానీ వైసీపీ ప్రతిపాదించిన మూడు రాజధానులకు జనసేన పార్టీ వ్యతిరేకమని వెల్లడించారు పవన్ కల్యాణ్. రాజధాని అంటే టీడీపీ, వైసీపీలకు ఆటైపోయిందని విమర్శించారు. రాజధాని పేరుతో ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఇప్పుడు రాజధానిని మార్చి వైసీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని పవన్ విమర్శించారు. రాజధాని పై ఆటలాడుతున్న ఆ రెండు పార్టీలను జనసేన బలంగా ఎదుర్కొంటుందన్నారు.

వైసీపీకి విశాఖపై ప్రేమ లేదు

గాంధీనగర్ తరహాలోనే అమరావతి నిర్మాణానికి 10 నుంచి 14 వేల ఎకరాలు చాలని చెప్పినా అప్పటి టీడీపీ ప్రభుత్వం నా మాటలు పట్టించుకోలేదని తెలిపారు పవన్. ఇప్పుడు ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందన్న నెపంతో వైసీపీ ప్రభుత్వం ఏకంగా రాజధానినే వైజాగ్ కు తరలిస్తుందన్నారు. ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నంలో ఫ్యాక్షన్ కల్చర్, రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలని చూస్తున్నారని, ఇలాంటి రియల్ ఎస్టేట్ దందాలు తెలంగాణలో చేస్తే ఛీ కొట్టారని గుర్తుచేశారు. వైసీపీ చేస్తున్న ఈ అరాచకాన్ని యువత, మహిళలే అడ్డుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.

రాజధానిని ఉత్తరాంధ్ర తరలించడానికి వెనకున్న అసలు కారణం అక్కడి ప్రజలపై ప్రేమ కాదు...రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలన్న ఆశ అని పవన్ హితవు పలికారు. ఉత్తరాంధ్ర భూములు రాజకీయ నాయకుల చేతుల్లోకి ఎప్పుడో వెళ్ళిపోయాయన్నారు. నిజంగా ఉత్తరాంధ్ర ప్రజల మీద ప్రేమే ఉంటే పలాసలో క్యాషు బోర్డు ఈ పాటికే వచ్చి ఉండేదన్నారు. అలాగే రాయలసీమ ప్రాంత వెనుకబాటుకు ఆ ప్రాంత నాయకులే కారణమని పవన్ దుయ్యబట్టారు.

సంయమనం కోల్పోతే పరిస్థితులు చేయి దాటిపోతాయి

ప్రజాస్వామ్యబద్ధంగా రాజధాని మార్పు జరిగితే.. రాజధాని గ్రామాల్లో 7,400 మంది పోలీసులు ఎందుకు..? అని పవన్ కల్యాణ్ మీడియా ముఖంగా ప్రశ్నించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతు రోడ్డున పడి, లాఠీ దెబ్బలు తిని, రక్తం చిందిస్తున్నాడని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్టంలో ఆడపడుచుల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. వారికి అండగా ఉన్న జనసేన వీర మహిళలపై కూడా పోలీసులు దాడులు చేశారన్నారు. పోలీసుల లాఠీఛార్జ్ లో గాయపడ్డ రైతులను పరామర్శిస్తానంటే లా అండ్ ఆర్డర్ పేరు చెప్పి పర్మిషన్ ఇవ్వడం లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ వ్యవహార శైలి కారణంగా పోలీసులు ఇబ్బందులు పడుతున్నారని, రోజుల తరబడి కుటుంబాలను విడిచి రోడ్ల వెంట తిరగడంతో పాటు మహిళలతో తిట్లు తినే స్థాయికి పోలీస్ వ్యవస్థని ప్రభుత్వం దిగజార్చిందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తించలేదని, డి.ఐ.జి. స్థాయి అధికారిని పంపించి మా కార్యాలయంలోనే మమ్మల్ని నిర్భందించి, అడుగు బయటపెట్టకుండా చేశారని పవన్ చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఉద్యమాలు చేస్తే అప్పుడున్న ప్రభుత్వం ఇలానే ప్రవర్తించిందా? అని ప్రశ్నించారు. పోలీసు శాఖ, లా అండ్ అర్డర్ పై ఉన్న గౌరవంతో ఇంతసేపు ఓపికతో ఉన్నాం..ఒక్క క్షణం సంయమనం కోల్పోతే పరిస్థితులు చేయి దాటిపోతాయని, కాబట్టి వైసీపీ ఆచితూచి వ్యవహరించాలని హెచ్చరించారు.

రాపాకపై ప్యాక్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం

ప్రజలు ఓట్లు వేసి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అధికారాన్నిస్తే...వైసీపీ ప్రభుత్వం వారికి అశాంతి, అలజడిని ఇచ్చిందని పవన్ అన్నారు. ఈ ఏడు నెలల్లో ప్రభుత్వం చట్టానికి లోబడి ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి 30 వేల ఎకరాలు కావాలన్న వ్యక్తి ఈ రోజు ఇన్ సైడ్ ట్రేడింగ్ అని చెప్పి రాజధానిని విశాఖకు తరలించడం వెనుకున్న ఆంతర్యమేమిటో అందరికీ తెలుసన్నారు. నిజంగా తప్పు జరిగితే అధికారం చేతిలో ఉంది కాబట్టి తప్పుచేసిన వ్యక్తులపై కేసులు పెట్టి జైల్లో వేయాలి గాని.. రాజధానిని మార్చడం సబబు కాదన్నారు.

జనసేన, భారతీయ జనతా పార్టీలు రాజధాని రైతుల ఆందోళనలకు అండగా ఉంటాయని పవన్ భరోసా ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడైన జేపీ నడ్డాతో రాజధాని అంశంపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కి రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పినా ఆయన వినకుండా, వైసీపీ స్టాండ్ తీసుకోవడంపై పవన్ అసహనం చెందారు. రాపాక చర్యలపై పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ తెలిపారు.

Next Story