రెండో విడత 'వాహన మిత్ర'కు శ్రీకారం చుట్టనున్న జగన్‌

By సుభాష్  Published on  20 May 2020 9:03 AM GMT
రెండో విడత వాహన మిత్రకు శ్రీకారం చుట్టనున్న జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహరెడ్డి పాలన పగ్గాలు చేపట్టిననాటి నుంచి తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. అభివృద్ధే ధ్యేయంగా ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తక్కువ సమయంలోనే ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రభుత్వ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. విధి నిర్వహణలో తేడా వచ్చిన అధికారులపై కొరఢా ఝులిపిస్తున్నారు.

Vahana Mitra1

ప్రజా సమస్యలపైనే నా పోరాటం అంటూ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పాదయాత్రలో చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలానే స్పందిస్తున్నారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి తప్పకుండా అమలు చేస్తూ వస్తున్నారు. ఇచ్చిన హామీలే కాకుండా ప్రజల కోసం పాటుపడుతూ కొత్త పథకాలను సైతం రూపొందిస్తున్నారు జగన్‌. రాష్ట్రంలో విద్యార్థులకు, పేదలకు, వృద్దులకు, ఇండ్లు లేని వారికి ఇళ్ల పట్టాల విషయంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ముందుకు కదులుతున్నారు.

ఇక తాజాగా జూన్‌ 4వ తేదీన మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు జగన్‌. కరోనా, లాక్‌డౌన్‌ లాంటి విపత్కర సమయంలో ఇబ్బందులు పడుతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్‌, ట్యాక్సీ డ్రైవర్లకు రెండో విడత వాహన మిత్ర పథకం ద్వారా రూ.10వేల ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మేరకూ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని వివరాలు కూడా వెల్లడించారు.

ఓనర్‌ కమ్‌ డ్రైవర్లు, ఆటో మ్యాక్సి క్యాబ్‌ ట్యాక్సీ డ్రైవర్లు సొంతంగా వాహనాలు కొనుక్కుని నడుపుకొంటూ జీవనం సాగిస్తున్న వారికి ఈ పథకం వర్తించనుంది. అయితే వాహనమిత్ర పథకానికి లబ్ధిదారులు మే 26వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కథకం ద్వారా సాయం పొందాలనుకునేవారికి ఆన్‌లైన్‌, ఆఫ్‌ లైన్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గత ఏడాది లబ్దిపొందాన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి నాని తెలిపారు.

అయితే ఈ పథకాన్ని మొదటి విడత ఏలూరులో ప్రారంభించారు. ఏలూరులోనే ప్రారంభించడానికి ఓ కారణంగా కూడా ఉంది. జగన్‌ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టిన సందర్భంలో ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు జగన్‌ను కలిసి అధికారంలోకి వస్తే తమను ఆదుకోవాలని విన్నవించుకున్నారు. దీంతో జగన్‌ స్పందించి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అందుకే ఇచ్చిన హామీ మేరకూ వాహనమిత్ర పథకం పేరుతో మొదటి విడత ఏలూరులో ప్రారంభించారు. ఇక రెండో విడత కూడా సాయం అందించనున్నారు.

మొదటి విడతలో ఎంత మంది లబ్ధిదారులు:

కాగా, గత ఏడాది మొదటి విడత వాహనమిత్ర పథకం కింద మొత్తం 2,36,334 మంది లబ్ధిదారులు సాయం అందుకున్నారు. మొత్త లబ్దిదారుల్లో 1,05,932 మంది బీసీలు, 54,485 మంది ఎస్సీలు, 13,091 మంది ఓసీలు, 27,107 మంది కాపులు, 8,762 మంది ఎస్టీలు, 25, 517 మంది మైనార్టీలు, 509 మంది బ్రహ్మణ, 931 మంది క్రైస్తవులు ఉన్నారు.

Next Story