రైతుల కోసం 'వైఎస్సార్‌ జనతా బజార్‌లు: సీఎం జగన్‌

By సుభాష్
Published on : 15 May 2020 2:01 PM IST

రైతుల కోసం వైఎస్సార్‌ జనతా బజార్‌లు: సీఎం జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ శుక్రవారం వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి తొలి విడతగా రూ. 7,500 ఖాతాలో జమ కానున్నాయి. రాష్ట్రంలోని 49 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా కింద రూ.13,500 యేటా అందించనున్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన అంనతరం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

రాష్ట్రంలోని అన్నదాతలకు ఎల్లవేళల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, వచ్చే ఏడాది జనతా బజార్‌లను రైతుల కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ పథకం ద్వారా ఖరీఫ్ పంటకు సిద్దమయ్యే రైతులకు పెట్టుబడి సాయంగా ఒక్కో రైతుకు రూ.5,500 అందించనున్నట్లు తెలిపారు. రైతులకు మరింత ఉండగా ఉండేందుకు వచ్చే సంవత్సరం గ్రామ సచివాలయాల పక్కన వైఎస్సార్‌ జనతా బజార్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే రైతులు పండించిన పంటలతో పాటు పండ్లు, పూలు, కూరగాయలు, చేపలు వంటివి అమ్ముకునేందుకు ఈ జనతా బజార్‌లు ఉపయోగపడతాయన్నారు.

వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు రైలులకు శ్రమ కలుగకుండా ఈ జనతా బజార్లు సరైన వేదిక అని అన్నారు. గ్రామ స్థాయిలో కోల్డ్‌ స్టోరేజి సదుపాయం కల్పించే స్థాయికి తీసుకెళ్తామన్నారు. అలాగే రాష్ట్ర, జిల్లా స్థాయిలో వ్యవసాయ బోర్డులు ఏర్పాటు చేస్తామని, ఈనెల 30న రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు.

Ysr Rythu Bharosa Scheme

Next Story