దేశ వ్యాప్తంగా కరోనా విజృంభించడంతో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో ప్రజా రవాణా సైతం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో హర్యానా సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ప్రజారవాణాను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇన్ని రోజులు డిపోలకు పరిమితమైన బస్సులు.. ప్రభుత్వం నిర్ణయంతో మళ్లీ రోడ్లెక్కనున్నాయి. శుక్రవారం నుంచి ప్రజారవాణాను ప్రారంభిస్తున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ప్రకటించారు.

ఈ మేరకు ఆయా డిపోల సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. కాగా, మార్చి 25వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రంగాలు మూసివున్న విషయం తెలిసిందే. దీంతో రవాణా సౌకర్యం కూడా నిలిచిపోయింది. అయితే మూడో లాక్‌డౌన్‌ లో భాగంగా కేంద్రం కొన్నింటికి మినహాయింపులు ఇవ్వడంతో హర్యానా సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే కేంద్రం సూచనలతో గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో బస్సులు నడిపేందుకు ఆయా రాష్ట్రాలు సిద్ధపడ్డాయి. ఇందుకోసం బస్సులను పూర్తిగా శానిటైజ్‌ చేయడమే కాకుండా బస్సుల్లో ప్రయాణించేవారు సామాజిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ప్రయాణ సమయంలో ప్రయాణికులు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఒక వేళ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు.

అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా బస్సులు రోడ్లెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇక నాలుగో దశ లాక్‌డౌన్‌లో భాగంగా మోదీ మరికొన్ని సడలింపులు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజారవాణాను ప్రారంభించేందుకు ఇరు రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *