నేడు సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్న 'వైఎస్సార్‌ ఆసరా' పథకం

By సుభాష్  Published on  11 Sep 2020 3:38 AM GMT
నేడు సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్న వైఎస్సార్‌ ఆసరా పథకం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని సంచలన నిర్ణయాలే తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే ఇచ్చిన హామీలను నెవేర్చుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి 'వైఎస్సార్‌ ఆసరా' పథకాన్ని అమలు చేస్తామంటూ ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన హామీ. ఈ పథకం శుక్రవారం నాడు సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించే పథకాన్ని నేడు ప్రారంభించనున్నారు. 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168,83 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ కానుంది. ఇందులో భాగంగా తొలి ఏడాది రూ.6,792,20 కోట్లను ఆయా కార్పొరేషన్ల ద్వారా నేడు జమ కానుంది. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్న నిర్ణయాన్ని అక్కచెల్లెమ్మలకే వదిలేస్తున్నామని, బ్యాంకర్లు ఆ మొత్తాన్ని పాత అప్పులకు మినహాయించుకోకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నేటి నుంచి వారోత్సవాలు

వైఎస్సార్‌ ఆసరా పథకం ప్రారంభోత్సవాన్ని వారం రోజుల పాటు ఉత్సవంలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో రాజాబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎంజగన్‌ తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పథకాన్ని లాంఛనగా ప్రారంభిస్తారు. అలాగే మహిళలకు రూ.6,792 కోట్లకు సంబంధించిన చెక్కులను అందజేస్తారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పొందుపు సంఘాల మహిళలు తిలకించేలా చర్యలు చేపట్టారు.

Next Story