అమరావతి: తన తండ్రి వివేకానందరెడ్డి హత్యపై ఎన్నో అనుమానాలున్నాయని వివేకా కుమార్తె, ప్రముఖ వైద్యురాలు సునీత్‌ హైకోర్టుకు తెలిపారు. దయ చేసి ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని ఆమె హైకోర్టును అభ్యర్థించింది. గత ప్రభుత్వంలో సీబీఐ విచారణ కోరిన వైఎస్‌.జగన్‌.. ఇప్పుడు సీఎం అయ్యాక పట్టించుకోవడం లేదన్నారు. సిట్‌ దర్యాప్తు తీరుపై అనుమానాలున్నాయన్నారు. సీబీఐ కాకపోతే ఏదైనా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని సునీత కోర్టును వేడుకున్నారు. ఈ కేసు సీబీఐకి అప్పగించాలని గతంలోనే వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, అల్లుడు భాస్కర్‌రెడ్డి, సీఎం వైఎస్‌ జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సునీత దాఖలు చేసిన పిటిషన్‌లో అనుమానిత వ్యక్తులపై సంచలన ఆరోపణలు చేశారు.

వివేకా హత్య దర్యాప్తు కోసం ఏర్పాటైన సిబ్బందిపై అమె అనుమానం వ్యక్తం చేశారు. సిట్‌-2లో నియమితులైన అభిషేక్‌ మహంతీ దీర్ఘకాలిక సెలవులపై వెళ్లారు. మరోవైపు ఈ కేసులో అమాయకుల్ని ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అంటున్నారు. ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవిలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ చీఫ్‌ చేత ప్రభావితం కాని సంస్థతో దర్యాప్తు చేయించాలని ఆయన అభ్యర్థించారు. పిటిషన్‌లో కేంద్రహోంశాఖ కార్యదర్శి సీబీఐ డైరెక్టర్‌, రాష్ట్రం హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, సిట్ ఎస్పీ ప్రతివాదులుగా ఉన్నారు. ఘటనాస్థలంలో ఉన్నవారి, సన్నిహితుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత తమకు కొందరిపై అనుమానాలున్నాయని పలువురి పేర్లతో ఉన్న జాబితాను సునీత కోర్టుకు సమర్పించారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా పడింది.

గత ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. వివేకా హత్య కేసులో టీడీపీ నేతల హస్తముందని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌గా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌.. వివేకా హత్య కేసు దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు సిట్‌ అధికారులు 1300 మంది సాక్షుల్ని విచారించారు. అయిన ఇప్పటి వరకు నిందితుడిని పట్టుకోకపోవడం గమనార్హం. సిట్‌ అధికారి అభిషేక్‌ మహంతి దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడం కూడా అనుమానాలకు తావిస్తోందని సునీత అన్నారు.

ప్రస్తుతం ఎస్పీగా ఉన్న కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆధ్వర్యంలో విచారణ నత్తనడకన సాగుతోందని తెలుస్తోంది. సీబీఐ విచారణ కోసం డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ జగన్‌ హైకోర్టులో పిటిషన్‌తో పాటు గవర్నర్‌కు వినతిపత్రం కూడా ఇచ్చారని సునీత తెలిపారు. అయితే జగన్‌ సీఎం అయ్యాక ఇప్పటి వరకై ప్రభుత్వం తరఫున కౌంటర్లు కూడా వేయలేదన్నారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని చెప్పిన వ్యక్తి.. ఇప్పడు అధికారంలోకి వచ్చాక సిట్‌ను ఎందుకు మార్చారని ఆమె అన్నారు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు తీరును చూస్తుంటే.. అసలు నేరస్థులను వదిలేసి, అమాయకులను ఇరికించేస్తారేమోనని అనుమానం కలుగుతోందన్నారు.

పలువురిపై అనుమానాలు..

2019 మార్చి 14న వైఎస్‌ వివేకా అతని సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. వైఎస్‌ వివేకాను గొడ్డళ్లతో నరికి చంపారు. ఆ రోజు సంఘటన స్థలం వద్ద ఉన్న పలువురు వ్యక్తులపై అనుమానాలు కలుగుతున్నాయి. అయితే... వారిపై ఎలాంటి నిర్దిష్టమైన ఆరోపణలు చేయడం లేదని సునీత తన పిటిషన్‌లో కొందరి పేర్లను పేర్కొన్నారు.

సునీత పేర్కొన్న జాబితాలోని పేర్లు: వాచ్‌మన్‌ రంగయ్య, ఎర్ర గంగిరెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి సన్నిహితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, సీఐ శంకరయ్య, ఏఎస్‌ఐ రామకృష్ణారెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి

కాగా ఈ కేసుపై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. వివేకా కేసును సీబీఐకి అప్పగించకపోవడానికి అభ్యంతరమేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకు వేసిన పిటిషన్లలో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.

అంజి

Next Story