పోలీస్ స్టేషన్లకు యువత పరుగు!
By Newsmeter.Network Published on 25 March 2020 4:26 PM ISTయువత పోలీస్ స్టేషన్‌ల వద్దకు పరుగెడుతున్నారు. దీంతో పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్, రాయదుర్గంతో పాటు పలు పోలీస్ స్టేషన్‌లు కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం నుంచి యువత స్టేషన్‌ల వద్దనే బారులు తీరారు. ఇదేంటి.. అంతగా ఏం తప్పుచేశారు.. అంత మంది పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నారు..? అనుకుంటున్నారా.. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. భారత్‌లో రోజురోజుకు కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు.
దీంతో హైదరాబాద్‌లో ఎవ్వరూ బయటకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో హాస్టళ్లుసైతం మూయించి వేస్తున్నారు. దీంతో హాస్టళ్లలో ఉండి ఉద్యోగాలు చేసుకునే వారు, చదువుకొనేవారు తమతమ గ్రామాలకు బయలుదేరారు. దీంతో పోలీసులు బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో తమ గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేక.. పోలీసుల అనుమతి కోసం పోలీస్ స్టేషన్‌ల వద్దకు పరుగులు పెడుతున్నారు.
ఇప్పటికే పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్, రాయదుర్గంతో పాటు భాగ్యనగరంలోని పలు పోలీస్ స్టేషన్లు ఆయా ప్రాంతాల్లోని విద్యార్థులతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్‌లో ఉండటంతో తమ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, ఏదైనా వాహనంపై వెళ్దామంటే పోలీసులు అనుమతించడం లేదని స్టేషన్‌కు వచ్చిన పలువురు యువకులు వాపోయారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది మాట్లాడుతూ.. విద్యార్థులు తమతమ గ్రామాలకు వెళ్తామని భారీగా స్టేషన్‌లకు వస్తున్నారని, ఒక్క ఎస్‌ఆర్ పోలీస్ స్టేషన్‌లలో 500మంది వరకు విద్యార్థులు వచ్చారని పేర్కొన్నారు. వీళ్లందరికి ఏదో ఒక పరిష్కారం చూపిస్తామని, వెహికిల్స్ లేనివారికి సదుపాయం కల్పించేలా ఆలోచిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు.