యువశక్తిపై కుంగుబాటు కొరడా..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 30 Aug 2020 11:22 AM ISTనెత్తురు మండే శక్తులు నిండే యువకుల్లారా రారండి.. అంటూ మహాకవి శ్రీశ్రీ కవితావేశంగా పిలుపునిచ్చారు. నిజమే...ఉక్కు నరాలు.. మరిగే నెత్తురుతో యువత నిత్యం చైతన్యంతో కళకళ లాడుతుంటుంది. అలాంటి యువతలో కుంగుబాటు భావనలు తలెత్తుతున్నాయని.. దానికి కారణం కరోనా సంక్షోభమే కారణమని తాజాగా ఓ సర్వే ద్వారా తెలుస్తోంది. కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయింది. ఈ మక్షా సంక్షోభం నుంచి కోలుకోడానికి చాలా సమయమే పడుతుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తాజాగా కరోనా వేళ విధించిన లాక్‌డౌన్ యువతలో కుంగుబాటుకు ప్రధాన కారణంగా నిలుస్తోందని తెలుస్తోంది.
లాక్‌డౌన్ యువతలోనే కాదు చాలా మందిలో మానసిక ఆందోళన కలిగించింది. మొదట్లో మార్చిలో ఒకరోజు జనతా కర్ఫ్యూ అంటూ ప్రధాని పిలుపునిస్తే అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంటి వద్దే ఉండి గంటకొట్టారు. ఏముంది దీంతో సరిపోతుంది అనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి మన దేశంలో చేయబోయే విలయ తాండవానికి అది ప్రమాద ఘంటిక అని ఆనాడు ఎవరూ ఊహించలేదు. నెల రెండు నెలలూ.. ఇలా అయిదు నెలలు ఇంటిపట్టునే ఉండపోవాల్సి రావడంతో జనాల్లో అసహనం పెరిగిపోయింది.
ముఖ్యంగా యువతకు. ఎప్ఫుడూ ఉరిమే ఉత్సాహంతో సంతోషానికి చెదరని చిరునామాల్లా కనిపించే యువతీయువకులు ఒక్కసారిగా ఇంటిలో బందీ అయిపోయారు. మొదట్లో ఇదేదో బావుంది కాలేజీలకు వెళ్ళనక్కర్లేదని అనుకున్నారే గానీ.. పనీ పాట లేకుంటే జీవితమెంత ఖాళీ అయిపోతుందో తొలిసారిగా చూస్తున్నారు. ఒక వైపు ఖాళీగా ఉండటం.. మరోవైపు నిత్యం కరోనా బాధితుల చేదు వార్తలు వెలువడుతుండటంతో వారు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.
లాక్‌డౌన్ ముందుకు సాగుతున్న కొద్దీ కాలేజీ విద్యార్థుల భావోద్వేగాల్లో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ మానసిక ఆరోగ్య వేదిక ‘యువదోస్త్’ రెండు విడతలుగా దాదాపు ఎనిమిది వేల మంది యువకులతో సర్వే నిర్వహించింది. లాక్‌డౌన్ మొదట్లోనూ.. జూన్ నెలలోనూ రెండు దఫాలుగా వివిధ సామాజిక వర్గాల యువతను సర్వే చేసిన ఫలితాలను విశ్లేషిస్తే ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి.
కోపం, అసహనం, ఒంటరితనం తదితర ప్రతికూల భావాలు దాదాపు 41 శాతం మందిలో ఆందోళన, భయాలు ఉన్నట్లు గుర్తించారు. కోపం అసహనం చీకాకులు 51 శాతం మందిలో ఉంటున్నట్లు తెలుస్తోంది. నిరాశ నిస్పృహలు 27శాతం మందిలో, విచారం 17శాతం మందిలో ఉన్నట్లు ఆ సర్వే తేల్చింది.
కరోనా తమ స్వేచ్ఛకు సంకెళ్లు వేసినట్లు యువత భావిస్తోంది. కరోనా మనల్నేం చేస్తుందిలే అని విస్తృతంగా తిరిగేవారు వెంటనే దాని బారిన పడటం చూస్తున్న యువత ఆ సాహసానికి పూనుకోవడం లేదు. మొదట్లో కరోనా కేవలం 50 ఏళ్ళు పైబడిన వారినే లక్ష్యంగా చేసకుంటుంది అని అనుకున్నారు. అయితే అనుభవం వేరుగా ఉంటోంది. యువకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. దీంతో స్వీయ నిర్బంధంలో ఉండిపోతున్నారు.
కాలేజీ అంటేనే బోరు అనుకునే వారు ఇప్పుడు ఆ కాలేజీ గేట్లు ఎప్పుడు తెరచుకుంటాయా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రోజూ స్నేహితులతో కబుర్లు..పిచ్చాపాటీ మాటలు.. విందులు వినోదాలు షికార్లు అన్నీ మిస్ అయిపోతున్నారు. థియేటర్లు లేవు.. టూర్‌లకు వెళదామంటే రవాణా లేదు.. ఎంతసేపూ ఫోన్లలో చాటింగ్ చేయాలంటే విసుగ్గా ఫీలవుతున్నారు.
‘ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ హేట్ హాలిడేస్..’ అన్న మెసేజ్ వాట్సప్‌లలో విపరీతంగా చక్కర్లు కొట్లిందంటే.. యువత మానసిక స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. ఇంట్లోనే ఉండటం...కుటుంబ సభ్యల మధ్యే కాలం వెళ్ళబుచ్చుతుండటంతో తాము స్వాతంత్య్రం కోల్పోయామన్న భావన యువతలో కలుగుతోందని ఈ సర్వే ద్వారా తెలుస్తోంది.
కాలేజీ యువత తర్వాత ఉద్యోగులు ఇలాంటి ఆందోళనకు గురవుతున్నారు. ఒక రోజు లీవు కావాలన్నా బాస్ ముప్పతిప్పలు పెడుతున్నాడని.. పని పని పనీ చచ్చిపోతున్నామని తరచూ కామెంట్లు చేస్తున్న ఉద్యోగులు జీవితంలో మొదటి సారిగా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. మొదట్లో ఇదో రిలీఫ్ అనిపించినా ఆ తర్వాత విరామమే లేని విరామం ఎంత విసుగ్గా ఉంటుందో వారికి తెలిసొస్తోంది.
పైగా ఈ కరోనాను అడ్డు పెట్టుకున్న చాలా బడా కంపెనీలు ఉద్యోగాలకు కోతలు విధిస్తుండటంతో ఆందోళనతో కుంగిపోతున్నారు. తమ వంతు కూడా వస్తుందేమోనని భయపడుతున్నారు. ఉద్యోగుల్లో భయాందోళనలు 41శాతం దాకా పెరిగిపోయింది. కోపం అసహనం చిరాకు 34 శాతం, నైరాశ్యం 17శాతం, ఒంటరితనం 26 శాతంగా ఉంటోందని సర్వే సారాంశం.
కరోనా కేవలం శరీరంపైనే కాదు మనసులపైనా దాడి చేస్తోందనడానికి ఈ సర్వే ఓ ఉదాహరణ. ఒక వైపు వైరస్ పీడితులు. .మరోవైపు ఆర్థిక సంక్షోభం.. ఇంకోవైపు మానసిక ఆందోళన.. మనుషులపై ముప్పేట దాడులు చేస్తున్నాయి. అన్‌లాక్ దశలు దాటుతున్నా.. వైరస్ విజృంభణ ఆందోళన కలిగించే విషయమే!
మొదట్లో వందల్లో ఉన్న పాజిటివ్ కేసులు ఇప్ఫుడు వేలల్లో ఎగబాకింది. కళ్ళముందే ఎందరో కరోనాతో విలవిల్లాడిపోతుండటాన్ని చూస్తుండటం కూడా ఆందోళనకు ఒక కారణం. ఈ ఏడాది మొదట్లో అసలు ఇలాంటి వైరస్ వస్తుందని గానీ, దేశం ఇంతగా అతలాకుతలం అవుతుందని గానీ ఎవరూహించారు? మన జీవితంలో 2020 సంవత్సరాన్ని తీసేయాల్సిందే అని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు గానీ.. జీవితం నుంచి తీసేసినా, చరిత్ర నుంచి తీసేయలేముగా! కొన్నాళ్ళు పోయాక ఈ అనుభవాలు అందమైన కథలు కావచ్చు గానీ ఇప్పడు అనుభవిస్తున్న వారికి మాత్రం కచ్చితంగా దుర్భరమే!