లవ్ ఫెయిల్ అంటూ వాట్సాప్ స్టేటస్.. ఆ తర్వాత కొన్ని గంటలకే..
By అంజి Published on 17 Feb 2020 3:09 PM IST
కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు బైక్‌పై అతివేగంగా వెళుతూ.. లవ్ ఫెయిల్ అంటూ తీసిన వీడియోను వాట్సాప్‌లో స్టేటస్ పెట్టడం.. అనంతరం కొద్దిసేపటికే చనిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజంపేటకు చెందిన ప్రదీప్ గౌడ్ (19).. బైక్‌పై అతివేగంగా వెళ్లి ప్రాణాలు పొగొట్టుకున్నాడు. ఉగ్రవాయి శివారులో ఆదివారం రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్కంటి ప్రదీప్ గౌడ్ మృతిచెందాడు. ప్రేమ విఫలం కావడంతో ప్రదీప్ గౌడ్ సూసైడ్ చేసుకున్నాడా లేదా ఏదైనా వాహనం ఢీకొట్టి మరణించాడా అన్నది సస్పెన్షన్‌గా మారింది. ప్రదీప్ ఎక్కువగా చదువుకోలేదని, ప్రస్తుతం స్థానికంగా ఉన్న వైన్‌షాపులో పని చేసేవాడని ప్రదీప్ తండ్రి వెంకటి గౌడ్ తెలిపారు.
గత కొంత కాలంగా ఖాళీగానే ఉంటున్నాడని అన్నారు. కామారెడ్డి-సిరిసిల్ల రహదారిపై జరిగిన ప్రమాద స్థలాన్ని దేవునిపల్లి పోలీసులు పరిశీలించారు. ప్రదీప్ గౌడ్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ప్రదీప్ చనిపోవడంతో.. అతడి కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్నారు. అయితే అతడు చివరిసారిగా ఎక్కడి వెళ్లాడన్నది తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడి మృతికి ప్రధాన కారణం ప్రేమ వ్యవహారమే అని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. అతడు చివరిసారిగా వాట్సాప్ స్టేటస్‌లో లవ్ ఫెయిల్ అంటూ తీసిన వీడియోను పోస్టు చేయడం కలకలం రేపుతోంది.