యెస్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త
By రాణి Published on 10 March 2020 1:10 PM ISTడిపాజిట్లు, పెట్టుబడులు అన్నీ పోయాయనుకుని..దిగులు చెందుతున్న ఖాతాదారులకు యెస్ బ్యాంక్ ఓ శుభవార్త చెప్పింది. సంక్షోభంలో ఉన్న ఈ బ్యాంక్ మంగళవారం నుంచి ఐఎంపీఎస్, నెఫ్ట్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
''ఐఎంపీఎస్, నెఫ్ట్ సేవలను తిరిగి పునరుద్ధరించాం. మా బ్యాంక్ ఖాతాదారులకు మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇతర బ్యాంక్ లకు లావాదేవీలు జరుపుకోవచ్చు. అలాగే ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు బకాయిలను ఇతర బ్యాంక్ ఖాతాల నుంచి చెల్లించుకోవచ్చు. మీ సహకారానికి కృతజ్ఞతలు'' అని యెస్ బ్యాంక్ ట్వీట్ లో రాసుకొచ్చింది.
Also Read : పేటీఎంకు ఫోన్‌పే పంచ్..
కాగా..యెస్ బ్యాంక్ పై ఆర్ బీ ఐ విధించిన మారటోరియంను శనివారం నాటికి ఎత్తివేయనున్నట్లు కొత్తగా వచ్చిన బ్యాంక్ పరిపాలకుడు ప్రశాంత్ కుమార్ వెల్లడించిన నేపథ్యంలో..ప్రకటించిన మర్నాటికే బ్యాంక్ ఈ ఐఎంపీఎస్, నెఫ్ట్ సేవలను పునరుద్ధరించడం గమనార్హం. వీలైనంత త్వరగా ఖాతాదారులకు అన్ని సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రశాంత్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఎస్ బ్యాంక్ ఖాతాదారుల నగదు ఉపసంహరణ పై ఆర్ బీఐ రూ.50 వేల పరిమితిని విధించిన సంగతి తెలిసిందే.
యెస్ బ్యాంక్ పై ఆర్బీఐ మారటోరియంను విధించిందని తెలియగానే ఖాతాదారులు యెస్ బ్యాంక్ బ్రాంచ్ ల ఎదుట క్యూ కట్టారు. బ్యాంక్ లో ఉన్న తమ డిపాజిట్లను విత్ డ్రాలు చేసుకునేందుకు పోటీ పడ్డారు. అయితే..ఎక్కువ వడ్డీకి ఆశపడి..అడిగిన వారందరికీ పెద్ద ఎత్తున రుణాలిచ్చేసి..తిరిగి వాటిని రాబట్టలేని కారణంగానే ఆర్ బీఐ యెస్ బ్యాంక్ లావాదేవీలపై షరతులు విధించింది.