వైసీపీ నేత పీవీపీ పై బంజారహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
By తోట వంశీ కుమార్ Published on 25 Jun 2020 1:54 PM IST
వైఎస్‌ఆర్‌సీపీ నేత, ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ పై బంజార హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ప్రేమ్ పర్వత్ విల్లాస్ పేరిట పీవీపీ నిర్మాణాలు చేపట్టారు. ఇందులో ఓ విల్లాను నాలుగు నెలల క్రితం కైలాస్ విక్రమ్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. విల్లాను మరింత ఆధునీకరించేందుకు విక్రమ్ పనులు చేపట్టారు.
విషయం తెలుసుకున్న పీవీపీ తన అనుచరులతో కలసి అక్కడకు వెళ్లారు. నిర్మాణ సామగ్రిని దించుతున్న వారిని అడ్డుకున్నారు. తన ఇంట్లోకి పీవీపీ అక్రమంగా ప్రవేశించి, సామాన్లు ధ్వంసం చేసినట్లుగా కైలాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తానని బెదిరించినట్టు కైలాస్ ఆరోపిస్తున్నారు. పీవీపీ వల్ల తనకు ప్రాణహాని ఉందని, అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కైలాస్ కంప్లైంట్‌తో బంజారాహిల్స్ పోలీసులు.. ఇద్దరు కానిస్టేబుళ్లను విల్లా ఉన్న సైట్ దగ్గరకు పంపారు. పోలీసులు.. పీవీపీపై ఐపీసీ 447, 427, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు.. పీవీపీని రాత్రి విచారణకు పిలిపించారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పీవీపీతోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో తొమ్మిది మందిని కూడా నిందితులుగా గుర్తించామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.
FIR-391-2020 PS-BANJARA HILLS - 25-06-2020 13-12-04
కాగా.. ఈ ఉదయం పీవీపీ ఆసక్తికర ట్వీట్ చేశారు. "తప్పుని తప్పు అనడం తప్పు అయితే, ఆ తప్పు ఎన్ని లక్షల సార్లు అయినా చేయవచ్చు. నోరు మూసుకునే కన్నా, చావడం మిన్న" అని ఆయన అన్నారు. ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసుంటారన్న చర్చ ఇప్పుడు మొదలైంది.