ఏపీలో వైసీపీ నేత దారుణ హత్య
By సుభాష్ Published on 29 Jun 2020 9:46 AM GMTఏపీలో హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత మోకా భాస్కర్‌రావు దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం చేపల మార్కెట్‌లోకి వెళ్లిన భాస్కర్‌రావును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అయితే కత్తితో దాడి చేసిన వ్యక్తులు.. కత్తికి సైనెడ్ పూయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హత్యలో నలుగురు యువకులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా సమాచారం. పక్కా ప్లాన్ ప్రకారమే భాస్కర్‌రావును హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భాస్కర్‌రావును నిందితులు కత్తితో బలంగా పొడిచి పరారయ్యారు.
సీసీ పుటేజీ ద్వారా నిందితుల గుర్తింపు
కాగా, దారుణ హత్యకు గురైన భాస్కర్‌రావు.. హత్య జరిగిన ప్రాంతంలోని పోలీసుల సీసీ పుటేజీలనీ పరిశీలించారు. ఈ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. హత్య కు పాల్పడిన నలుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత నిందితులు బైక్‌పై పరారైనట్లు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారిగా అనుమానిస్తున్న చిన్న, ఇతర నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్యలో భాస్కర్‌రావు గుండెకు బలమైన గాయం కావడంతోనే అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా, 2013లో సురేంద్ర అనే వ్యక్తి హత్య కేసులో భాస్కర్‌రావు నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.
మచిలీపట్నంలో వైసీపీ నేత, రవాణాశాఖ మంత్రి పేర్ని నానికి భాస్కర్‌రావు ముఖ్య అనుచరుడు. భాస్కర్ రావు గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పని చేశారు.